– సంప్రదాయం, కట్టుబాట్ల పేరుతో శ్రమ దోపిడీ
-ఎపి మహిళా సమాఖ్య మహాసభలో రమాదేవి
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్ :సమాజంలో మహిళల పట్ల హింస, అగాయిత్యాలు, శ్రమ దోపిడీ పెరిగిపోతున్నాయని వాటిని అరికట్టాలంటే సంఘటిత పోరాటాలతోనే సాధ్యమని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి అన్నారు. నంద్యాలలో జరుగుతున్న ఎపి మహిళా సమాఖ్య రాష్ట్ర 15వ మహాసభలో శనివారం ఆమె సౌహార్థ సందేశం ఇచ్చారు. తన మనుగడ కోసం సామ్రాజ్యవాద కాంక్షతో ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలను అమెరికా ప్రేరేపిస్తోందన్నారు. అందుకు గాజా, ఉక్రెయిన్ యుద్ధాలే నిదర్శనమని తెలిపారు. భారతీయ గణంకాల ప్రకారం మహిళలు చేస్తున్న పనిని 82 శాతం లెక్కించడం లేదన్నారు. ఒక్కసారి మహిళలు సమ్మె చేస్తే వారి విలువ ప్రభుత్వాలకు తెలుస్తుందని తెలిపారు. మహిళలు బలహీనులంటూ బిజెపి ప్రభుత్వం సంప్రదాయ భావజాలన్నీ పెంచుతోందని విమర్శించారు. స్త్రీలు మగవారి కంటే తక్కువ అని సనాతన ధర్మం చెబుతోందని, కులాల మధ్య తక్కువ, ఎక్కువ అని తేడాలు చూపిస్తున్న అలాంటి సనాతన ధర్మాన్ని మహిళా లోకం తిరస్కరించాలన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మహిళల్లో చైతన్యం పెరుగుతుంది కాబట్టే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల చట్టం చేస్తుందని తెలిపారు. ప్రశ్నించడం నేర్చుకోవాలని, హక్కుల కోసం మహిళా సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. మహాసభకు ఎపి మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి అధ్యక్షత వహించారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యు ఎపి మహిళా సమాఖ్య జాతీయ నాయకులు వనజ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గభవాని, వర్కింగ్ ప్రెసిడెంట్ అత్తిలి విమల, కార్యదర్శులు పాల్గొన్నారు.