అక్టోబర్ నెలలో దేశ వాణిజ్య లోటు ఎన్నడూ లేనంత ఎక్కువకు చేరుకోవడం ఆందోళనకరం. భారత ప్రభుత్వ వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆ నెలలో ఎగుమతులు 6.29 శాతం పెరగగా దిగుమతులు 14 శాతం పెరిగాయి. దేశ ఎగుమతులు 3,357 కోట్ల డాలర్లు (డాలరు ప్రస్తుత మారక విలువ రూ.83.20) కాగా దిగుమతులు 6,500 కోట్ల డాలర్లుగా నమోదయింది. ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతామనీ, విశ్వగురువు భారత్ అంటూ ప్రధాని మొదలు అధికారపార్టీకి చెందిన చోటా మోటా నేతలు ఊదరగొడుతుంటే వాస్తవ ఆర్థిక పరిస్థితి ఇలా ఉండడం గమనార్హం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాణిజ్య లోటు ఉండడం సాధారణమే అని కొందరనుకున్నా ఇంత ఎక్కువగా ఉండడం మాత్రం శ్రేయస్కరం కాదు. దేశ స్థూల ఉత్పత్తితో పోల్చి చూసుకుంటే ఇది మరింత ప్రమాదకరమైనదే! ఎగుమతులను పెంచుకోవాలంటూ పాలకులు ఎంతగా ఉద్ఘాటిస్తున్నా అది అంతలా పెరగడం లేదు. సెప్టెంబర్‌తో పోల్చితే అక్టోబర్ ఎగుమతుల్లో పెరుగుదల సాధించడం సంతోషించదగినదే. అక్టోబర్‌లో పెరుగుదల ఈ ఆర్థిక సంవత్సరం ఏడు నెలల్లో సాధించిన వాటిలో రెండవది. అంటే మిగిలిన ఐదు నెలల్లో స్థిరంగా ఉండడమో లేదా తగ్గడమో జరిగింది. ఇంకో విషయం ఏమిటంటే గత ఏడాది అక్టోబర్‌తో పోల్చితే పెరుగుదల తక్కువే. ఆ ముందుటేడాది 2021 అక్టోబర్‌లో 3,570 కోట్ల డాలర్లతో పోల్చితే ఇప్పటిది ఇంకా తక్కువ. అంటే పెరుగుదల శాతాల్లో చూసుకుంటే సంతోషంగా ఉన్నా వాస్తవంలో మన ఎగుమతుల స్థాయి రెండేళ్ల క్రితం కన్నా దిగువనే ఉంది. దిగుమతుల పరిస్థితి పరిశీలిస్తే అది రివర్స్ గేర్‌లో ఉంది. 2021 అక్టోబర్‌లో 5,320 కోట్ల డాలర్లుండగా 2022లో 5,360 కోట్ల డాలర్లకు, ఈ ఏడాది 6,500 కోట్ల డాలర్లకీ ఎగబాకింది. ఈ గణాంకాల ప్రకారం మనకు దిగుమతులు పెరుగుతున్నాయి కానీ ఆ మేరకు ఎగుమతుల్లో వృద్ధి లేదని విదితమవుతోంది. ఇదీ దేశ అభివృద్ధి తీరు !
ఈ కాలంలో మన ఎగుమతుల్లో ప్రధాన పెరుగుదల ఫార్మా రంగంలోనే ఉంది. గత ఏడాది అక్టోబర్‌తో పోల్చితే 29 శాతం పెరిగి 242కోట్ల డాలర్లకు చేరింది. ఫార్మా రంగంలో ముఖ్యంగా బల్క్ డ్రగ్ తయారీలో 1970వ దశకంలో మన దేశంలో పడిన పునాది ఇప్పుడు ఉపయోగపడుతోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ మాటున సంపన్న దేశాలు రుద్దిన పేటెంట్ ‘నిబంధనాలు’ లేకుంటే ఫార్మా రంగం మరింతగా విస్తరించేది. కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో భారత్‌కు జరిగిన అన్యాయం, విదేశీ కార్పొరేట్లు ప్రపంచమంతటా వేల కోట్ల డాలర్లు కొల్లగొట్టిన వైనం అందరికీ గుర్తుండే ఉంటుంది. పేద, కడుపేద దేశాలకు మన వ్యాక్సిన్లు చౌకగాను కొంత మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ఉచితంగా సరఫరా చేయడం తప్ప అమెరికా, బ్రిటన్ వంటి సంపన్న దేశాలకు భజన చేసే మోడీ సర్కారు ఇంకేమీ చేయలేదు. మోడీ సర్కారు వైఖరి మూలంగా సంపన్న దేశాలు ‘మీ ఇంటికొస్తే ఏమిస్తావ్? మా ఇంటికొస్తే ఏం తెస్తావ్?’ అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. మన పాలకుల మేక్ ఇన్ ఇండియా, ఎగుమతి ఆధారిత వ్యవసాయం వంటివి నినాదాలే తప్ప వాస్తవంలో జరిగేది మాత్రం విదేశీ కార్పొరేట్లకు భారత్ ఓ పెద్ద మార్కెట్‌గా ఉపయోగపడడం మినహా మరేమీ లేదన్నది స్పష్టం. వాణిజ్య లోటు పెరుగుదలకు మరో ముఖ్య కారణం డాలరుతో రూపాయి మారకం విలువ పడిపోవడం. రెండేళ్ల క్రితం అంటే 2021 నవంబర్ 16న డాలరుకు మారకం రూ.74.46 కాగా అది ఈ ఏడాది అదే తేదీన రూ.83.24కి పడిపోయింది. ఎగుమతిదార్లకు రూపాయల్లో కొంత లబ్ధి చేకూరినా దిగుమతులు అధికం కనుక మన దేశం నష్టపోయేది ఎక్కువగా ఉంటుంది. వినియోగదారులు మరింతగా నష్టపోతున్నారు.
నయా ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగానే దేశానికీ దురవస్థ ఏర్పడిందన్నది సుస్పష్టం. అంతేగాక అమెరికాకు జూనియర్ భాగస్వామిగా మారాక భారత్ పరిస్థితి పెనం మీది నుండి పొయ్యిలో పడినట్టయింది. ఈ ఆర్థిక విధానాల స్థానంలో స్వావలంబనకు దోహదపడే విధానాలొస్తేనేే దేశం బాగుపడుతుంది. అయితే కార్పొరేట్ మతతత్వ కూటమి పాలనలో అది అసంభవం. కాబట్టి ఈ ముదనష్టపు ప్రభుత్వాన్ని గద్దె దించడమే దేశ ప్రజల ముందున్న ఏకైక మార్గం.