ప్రజాశక్తి-నెల్లూరు : పోలీసు శాఖలో ఉన్న ప్రతి ఒక్కరు తమ తమ ఆరోగ్యం పట్ల అశ్రద్ద, నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దుని, ప్రతి ఒక్కరు ఒత్తిడిని అధిగమించేందుకు విధిగా వ్యాయామం చేయాలని, క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని ఎస్‌పి డాక్టరు కె.తిరుమలేశ్వరరెడ్డి సిబ్బందికి సూచించారు. శుక్రవారం రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు నగరంలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో పోలీసు సంక్షేమ దివాన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నిర్వహించిన కవాతును వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందిని ఉద్ధేశించి మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణతో పాటు ఆరోగ్యాన్ని అశ్రద్ధ, నిర్లక్ష్యం చేయవద్దు. ప్రతి రోజూ వారి వారి వయసును బట్టి, అన్ని నిముషాలు చమటోడ్చేలా వ్యాయామం, యోగా చేయాలన్నారు. 40 సంవత్సరాలు పైబడిన అందరూ తప్పక హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచనలు చేశారు. పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యుల సంక్షేమంలో భాగంగా త్వరలో పోలీసు గ్రౌండ్ నందు ప్రతి రోజూ యోగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సిబ్బంది ప్రతి ఒక్కరు దీనిని వినియోగిం చుకోవాలన్నారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్ నందు సిబ్బంది సమస్యలను పరిష్కరిం చడమే లక్ష్యంగా ”పోలీస్ సంక్షేమ దివాస్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడి సిబ్బందికి విధి నిర్వహణకు సంబంధించిన సమస్యలను, శాఖా పరంగా వారు పొందాల్సిన గ్రేడ్ ఇంక్రిమెంట్స్, బదిలీలు, భద్రత, కో ఆపరేటివ్ రుణాలు, అనారోగ్యం తదితర అర్జీలను స్వయంగా స్వీకరించి, నిశితంగా పరిశీలించి, అడ్మినిస్ట్రేటివ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అడిషనల్ యస్.పి.(అడ్మిన్),(క్రైమ్స్), (ఏఆర్) , ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.