ప్రజాశక్తి-చిలకలూరిపేట : జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) ఏజెంట్ల సమస్యలు, ఎల్‌ఐసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో గళం వినిపించిన ప్రజానాయకుడు, 11 సార్లు ఎంపీగా ఎన్నికవడంతోపాటు పలుమార్లు ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికైన మహానాయకుడు బాసుదేవ్ ఆచార్య అని ఎల్‌ఐసి ఎఐఒ పట్టణ అధ్యక్షులు చేవూరి కృష్ణమూర్తి అన్నారు. స్థానిక ఎన్‌ఆర్‌టి సెంటర్‌లోని ఎల్‌ఐసి కార్యాలయంలో బాసుదేవ్ ఆచార్య సంతాప సభ పి.నాగభూషణం అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలేసిన అనంతరం సీనియర్ బ్రాంచి మేనేజర్ పి.శేషగిరిరావు మాట్లాడుతూ జీవిత బీమా సంస్థ కోసం, ఏజెంట్ల హక్కుల కోసం నిరంతరం బాసుదేవ ఆచార్య పోరాడారన్నారు. ఏజెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎఒఐ)ను స్థాపించి ఏజెంట్ల హక్కుల కోసం పోరాడారని ఎఒఐ డివిజనల్ జయిట్ సెక్రటరీ గ్రంధి వీరయ్య అన్నారు. ఎల్‌ఐసి సీనియర్ ఏజెంట్, లియాఫీ డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ షేక్ అలిమియా మాట్లాడుతూ జీవిత బీమా సంస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోనివ్వకుండా బాసుదేవ్ ఆచార్య పోరాడారని, ఆయన ఆశయాలను కొనసాగిద్దామని చెప్పారు. కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ ఎస్‌వి.అబ్రహాం, ట్రెజరర్ నల్లపనేని సాంబశివరావు, డెవలపమెంట్ ఆఫీసర్ కె.వి.లక్ష్మినారాయణ, ఏజెంట్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.