ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : విజయవాడలో ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు సన్నాహక సమావేశం నరసరావుపేటలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులకు సంకెళ్లు వేస్తున్నారని, పోరాడి సాధించుకున్న హక్కులను రద్దు చేసి 4 లేబర్ కోడ్‌లు తెచ్చిందని విమర్శించారు. రాజ్యాంగాన్నీ తుంగలో తొక్కుతోందని, వ్యవసాయాన్ని కార్పొరేట్ల పరం చేయడానికి పూనుకుందని మండిపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని మోడీ గతంలో ప్రకటించారని, అయితే మోడీ పాలనలో 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతులు ప్రతిఏటా రూ.2 లక్షల కోట్లు నష్టపోతున్నారని చెప్పారు. అన్ని రంగాల్లో విఫలమవడంతోపాటు ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బిజెపిని గద్దె దింపేందుకు కార్మికులు, కర్షకులు, అన్ని రంగాల ప్రజలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.
కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ సాగుదార్లలో ఎక్కువమంది కౌలురైతులే అయినా వారికి గుర్తింపు, భరోసా ఏమీ లేదన్నారు. కౌలు రైతులకు సమగ్ర చట్టాన్ని తెవాలని డిమాండ్ చేశారు. పంట చేతికి వచ్చే సమయానికి ధరలు తగ్గిపోతున్నాయని, సిపిఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలుకు, మార్క్స్‌ఫెడ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలుకు చర్యలు చేపట్టాలన్నారు. పంటలకు అదనంగా బోనస్ ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి వసతి, వర్షాధారం అనే తేడా లేకుండా అన్ని పంటలనూ వర్షాధార పంటలుగానే పరిగణించి నష్టపరిహారం, బీమా పరిహారం అందించాలని కోరారు. పల్నాడు జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేశారు. కౌలు రైతులకు రూ.4 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా రూ.905 కోట్లే ఇచ్చారని తెలిపారు. దేవాదాయ భూములు సాగు చేసేవారికీ పంట రుణాలివ్వాలన్నారు. ఈ అన్ని అంశాలపై నిర్వహించే మహాధర్నాకు అన్ని రంగాల వారు తరలిరావాలని కోరారు. సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.హనుమంతరెడ్డి, ఎస్.ఆంజనేయ నాయక్, ఉపాధ్యక్షులు గుంటూరు విజరు కుమార్, పి.వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి జి.రవిబాబు, కోశాధికారి డి.శివకుమారి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎ.లక్ష్మీశ్వరరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జి.బాలకృష్ణ, కౌలురైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి హనుమంతరావు, నాయకులు విమల, పెద్దిరాజు, మహేష్, సిలార్ మసూద్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.