వాషింగ్టన్ : కృత్రిమ మేథస్సు (ఎఐ) ఉపాధికి ముప్పుగా పరిణమిస్తోందా ? అంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందు అసలు కృత్రిమ మేథస్సు అంటే ఏమిటో నిర్వచించడం తెలివైన పని. అలా చూసినపుడు సామాజిక మాధ్యమాలు, చిత్రాలు, టివి స్టూడియోలు, స్ట్రీమింగ్ వీడియోలు ఇవన్నీ తెరపైకి వస్తాయి. అయ్యే ఖర్చును తగ్గించుకోవడం కోసం ఈ సంస్థల అధిపతులందరూ కృత్రిమ మేథస్సును అమలు చేయాలని తహతహలాడుతున్నారు. ఒక రోజు పని కోసం పనిలోకి పెట్టుకోకుండా, వేతనం చెల్లించనక్కర లేకుండా పోతుందన్నది వారి ఆశ. వర్కర్ ఫోటో, గొంతు, మేనరిజమ్స్, మొత్తంగా శరీరాన్ని కంప్యూటకరీ కరించడం ద్వారా పనిచేసే వ్యక్తిని కృత్రిమంగా పున:సృష్టించేయవచ్చు. వర్కర్‌కు ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కరలేకుండానే పని జరిగిపోతుంది. అదనపు పనికి అదనపు జీతం చెల్లించనక్కరలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వర్కర్ల స్థానంలో ‘జాంబీలను తీసుకువస్తారు. ఇదిలాగే వదిలేస్తే, కృత్రిమ మేథస్సు ఆర్థిక అసమానతలను పెంచుతుంది. ఉపాధి భద్రతకు విఘాతం కల్పిస్తుందని ఎఎఫ్‌ఎల్-సిఐఎ సెక్రటరీ, ట్రెజరర్ ఫ్రెడ్ రెడ్‌మాండ్ హెచ్చరించారు. కొన్ని పరిశ్రమల్లో ఎఐ, హెచ్‌ఆర్ విభాగం చేసే పనులన్నీ చేసేయగలదు. అంటే కంప్యూటరే మనల్ని ఉద్యోగం నుండి తొలగించేయగలదు. పనిని, పనిచేసే వర్కర్లను మెరుగుపరిచే సాంకేతికత వున్నట్లే, అసలు పనిచేసేవారే అవససరం లేని సాంకేతికత కూడా రావడంతో ఉపాధికి ఇది ముప్పుగానే పరిణమిస్తోంది.