కేరళ నర్సు మరణ శిక్ష అప్పీల్‌ను తిరస్కరించిన యెమెన్‌ సుప్రీంకోర్టు

Nov 18,2023 12:03 #kerala
న్యూఢిల్లీ  :  మరణ శిక్షకు వ్యతిరేకంగా కేరళ నర్సు నిమిష ప్రియ దాఖలు చేసిన అప్పీల్‌ను యెమెన్‌ సుప్రీంకోర్టు తిరస్కరించింది. యెమెన్‌ వ్యక్తి హత్య కేసులో 2017 నుండి జైలులో ఉన్నారు.  ప్రియా తలాల్‌ అబ్దో మహదీ నుండి తన పాస్‌పోర్ట్‌ను తీసుకునేందుకు అతనికి ఇంజక్షన్‌ ద్వారా మత్తు మందు ఇచ్చి చంపిన కేసులో అక్కడి కోర్టు దోషిగా నిర్థారించింది.

యెమెన్‌లో అంతర్యుద్ధాల కారణంగా యెమెన్‌ వెళ్లడంపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో తనను యెమెన్‌ వెళ్లేందుకు అనుమతించాలంటూ ప్రియ తల్లి ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై గురువారం మరోసారి ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.

తన కుమార్తెను రక్షించుకోవాలంటే బాధిత కుటుంబంతో ప్రత్యక్షంగా చర్చలు జరపడం ఒక్కటే మార్గమని ప్రియ తల్లి తరపున న్యాయవాది సుభాష్‌ చంద్రన్‌ కె.ఆర్‌ కోర్టుకు తెలిపారు. ఆమెను యెమెన్‌ వెళ్లేందుకు అనుమతించాలని కోర్టును కోరారు. అయితే భారత్‌ విధించిన నిషేధం అడ్డంకిగా ఉందని పేర్కొన్నారు.

ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. యెమెన్‌కు ప్రయాణ నిషేధాన్ని సడలించారని కేంద్రం తరపు న్యాయవాది పేర్కొన్నారు. నిర్దిష్ట కారణాలు మరియు పరిమిత కాలంలో భారతీయ పౌరులు యెమెన్  సందర్శించేందుకు అనుమతించవచ్చని అన్నారు.  మరణశిక్షపై ప్రియ దాఖలు చేసిన అప్పీల్‌ను నవంబరు 13న యెమెన్‌ సుప్రీంకోర్టు తిరస్కరించినట్లు కేంద్రం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.  దీంతో ప్రియ తల్లిని యెమెన్‌ పంపించే అంశంపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు జడ్జి సుబ్రమణియమ్‌ ప్రసాద్‌ కేంద్రాన్ని ఆదేశించారు.

➡️