సహారాపై కేసు కొనసాగుతుంది : సెబీ ఛైర్‌పర్సన్‌ మధాబీ వెల్లడి

Nov 17,2023 10:28 #Sahara Group

ముంబయి : సుబ్రతా రారు మరణించినప్పటికీ సహారా గ్రూపునపై కేసులు యథాతథంగా కొనసాగుతాయని సెక్యూరిటీస్‌ ఎక్సేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ) ఛైర్‌పర్సన్‌ మధాబీ పూరీ బుచ్‌ వెల్లడించారు. ముంబయిలో జరిగిన ఫికీ సమావేశంలో మధాబీ మాట్లాడుతూ ఒక సంస్థ నిర్వాహకుడు జీవించి ఉన్నా, లేకున్నా.. దానిపై ఉన్న కేసులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. 2008 సమయంలో సహారా గ్రూపులోని సహారా ఇండియా రియల్‌ ఎస్టేట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఐఆర్‌ఇసిఎల్‌), సహారా హౌసింగ్‌ ఇన్వెస్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎస్‌హెచ్‌ఐసిఎల్‌) నిబంధనలకు విరుద్దంగా ప్రజల వద్ద నుంచి దాదాపు రూ.20వేల కోట్లు నిధులు సమీకరించి.. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాయి. రెగ్యూలేటరీ చట్టాలను ఉల్లఘించిన ఈ చర్యలపై సెబీ విచారణ చేపట్టింది. సెబీ నిబంధనలకు విరుద్ధంగా ఆప్షనల్లీ ఫుల్లీ కన్వర్టిబుల్‌ డిబెంచర్స్‌ జారీ చేసి మూడు కోట్ల మంది మదుపర్ల నుంచి నిధులు సమీకరించింది. ఈ సేకరించిన నిధులను రీఫండ్‌ చేయాలని 2011లో సహారా గ్రూప్‌ సంస్థలకు సెబీ ఆదేశాలు జారీ చేసింది. సుబ్రతా రారు సెబీ ఆదేశాలను విస్మరించారు. ఇది కాస్తా సుప్రీంకోర్టుకు చేరింది. ఆ తర్వాత సెబీ నిర్ణయం సరైందేనని.. రారు అవకతవకలకు పాల్పడ్డారని అత్యున్నత న్యాయ స్థానం తేల్చింది. దోషిగా తేల్చుతూ.. జైలు శిక్ష సైతం విధించింది. మదుపర్ల నుంచి సేకరించిన నిధులపై 15 శాతం వడ్డీతో వారికి చెల్లించాలని 2012 ఆగస్ట్‌లో ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా ఇన్వెస్టర్లకు సొమ్ము రీఫండ్‌ చేసేందుకు రూ.25 వేల కోట్ల నిధులను సెబీ వద్ద సహారా డిపాజిట్‌ చేసింది.
కానీ, నాటి నుంచి ఇప్పటి వరకూ మదుపర్లకు సెబీ కేవలం రూ.138 కోట్లు మాత్రమే రీఫండ్‌ చేసింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి ఇన్వెస్టర్లు సమర్పించిన ఆధారంగా పేమెంట్స్‌ జరుగుతున్నాయని మాధాబీ పురీ బుచ్‌ తెలిపారు. కాగా.. సెబీ ఇప్పటి వరకు కేవలం రూ.138 కోట్లు మాత్రమే చెల్లించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మాధాబీ సమాధానం ఇస్తూ.. సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి మదుపరులు సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా తిరిగి చెల్లింపులు జరుగుతున్నాయన్నారు.

➡️