ఆన్‌లైన్‌లో ఔషధాల అమ్మకానికి విధానాల రూపకల్పనపై ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌లో ఔషధాల అమ్మకాలకు సంబంధించి విధానాలు రూపొందించడానికి కేంద్ర ప్రభు త్వానికి ఢిల్లీ హైకోర్టు ఎనిమిది వారాల సమయం ఇచ్చింది. ఈ పిటీషన్ ఐదేళ్లకు పైగా కొనసాగుతోందని, కాబట్టి ఇదే అఖరి అవకాశమని హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. అలాగే, నిర్ణీత వ్యవధిలోగా పాలసీని రూపొందించకపోతే, ఈ అంశాన్ని (ఆన్‌లైన్‌లో ఔషధాల అమ్మకాలకు సంబం ధించి విధానాలు రూపొందించే) నిర్వహిస్తున్న ప్రధాన కార్యదర్శి తదుపరి విచారణలో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి 4కు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ పిటీషన్ విచారణ ఐదేళ్లకు పైగా కొనసాగుతోంది, కాబట్టి విధానాన్ని రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వానికి తగినంత వ్యవధి లభించింది కాబట్టి కేంద్రానికి చివరి అవకాశంగా ఎనిమిదివారాల సమయం ఇస్తున్నాం’ అని గురువారం ఉత్తర్వుల్లో ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను తాత్కాలిక సిజె జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మిని పుష్కర్ణతో కూడిన ధర్మాసనం జారీ చేసింది.