- పది బిల్లులు వెనక్కి పంపిన రాజ్ భవన్
- మళ్లీ ఆమోదానికి 18న ప్రత్యేక అసెంబ్లీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిల్లులను నిరవధికంగా తొక్కిపట్టే అధికారం గవర్నర్లకు లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మందలించిన వారం రోజులుకు తమిళనాడు గవర్నర్ పది బిల్లులను తిప్పి పంపారు. బిల్లులను క్లియర్ చేయడంలో గవర్నర్ల అసాధారణ జాప్యంపై కేరళ, పంజాబ్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు గవర్నర్లు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు కారనే విషయం గుర్తుంచుకోవాలని, చట్ట సభలు ఆమోదించిన బిల్లులు చట్ట రూపం దాల్చకుండా నిలిపివేసే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టం చేసింది.
బిల్లులను గవర్నరు వాపస్ చేసిన కొద్ది సేపటికే తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం. అప్పావు ఈ నెల 18న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బిల్లులను మళ్లీ పరిశీలించి ఆమోదించాక గవర్నర్‌కు తిరిగి పంపుతారు. అప్పుడు వాటిని గవర్నరు తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది.
ఉద్దేశపూర్వకంగా బిల్లుల ఆమోదంలో జాప్యం
పెండింగ్‌లో ఉన్న బిల్లులలో ఒకటి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల నియామక పద్ధతులకు సంబంధించినది. రెండవది అన్నాడిఎంకె ప్రభుత్వంలోని మాజీ మంత్రుల ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన బిల్లు. గవర్నర్ రవి ఇంతకుముందు నీట్ మినహాయింపు బిల్లును చాలా కాలం పాటు నాన్చి వెనక్కి పంపారు. అసెంబ్లీ మళ్లీ బిల్లును ఆమోదించిన తరువాత మాత్రమే దానిని రాష్ట్రపతికి పంపారు. ఆన్‌లైన్ గేమింగ్‌పై నిషేధం కోరుతూ వచ్చిన బిల్లును కూడా ఇలాగే తొక్కిపట్టారు.