ప్రజాశక్తి-విజయనగరం టౌన్:విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థులు శుక్రవారం నిరవధిక నిరాహారదీక్షలు చేపట్టారు. దీక్షలను ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ అశోక్ ప్రారంభించారు. పలు ప్రజాసంఘాల నాయకులు దీక్షలకు మద్దతు తెలిపారు. దీక్షలనుద్దేశించి అశోక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగానే ఉన్నాయని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ పోరాట ఫలితంగా సాధించుకున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇప్పటికీ సొంత భవనాలు కేటాయించని పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వ చిత్తశుద్ది అర్ధమవుతోందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యులు సిహెచ్ పావని మాట్లాడుతూ ఏళ్లు గడుస్తున్నా సమస్యలు పెరుగుతున్నాయే తప్ప పరిష్కారం కావడం లేదన్నారు. ఐదేళ్ల క్రితం నిరాహార దీక్షలు చేసిన సందర్భంగా విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తే నేటి వరకు చేయలేదని తెలిపారు. సమస్యలు పరిష్కారం కాకపోతే విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం రుచి చూడక తప్పదని హెచ్చరించారు. దీక్షలకు సిఐటియు, ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం, పట్టణ పౌర సంక్షేమ సంఘం, శ్రామిక మహిళా సంఘం నాయకులు మద్దతు తెలిపారు. దీక్షల్లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్ వెంకటేష్, పి.రామ్మోహన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.సూర్యనారాయణ, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.