హోం మంత్రి రాజీనామా చేయాలి

Nov 17,2023 21:58

– మహేంద్ర కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారమివ్వాలి
– రాజమహేంద్రవరంలో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి, కొవ్వూరు రూరల్‌ :దళిత యువకుడు బంతు మహేంద్ర మృతికి నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని శ్యామలా సెంటర్‌ వద్ద ధర్నా చేపట్టారు. మహేంద్ర మృతిపై సమగ్ర విచారణ చేయాలని, హోం మంత్రి రాజీనామా చేయాలని, దళితులపై దాడులను అరికట్టాలని ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినదించారు. ధర్నానుద్దేశించి సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్ళులు టి.అరుణ్‌, తాటిపాక మధు మాట్లాడారు. దళిత యువకుడి మృతికి నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని, మృతుని కుటుంబానికి రూ.50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులను గృహనిర్బంధం చేయడం దారుణమన్నారు. దళిత సంఘాల నాయకులతో కలిసి త్వరలో చలో దొమ్మేరు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
బాధిత కుటుంబానికి కెవిపిఎస్‌ పరామర్శ
బంత మహేంద్ర కుటుంబాన్ని కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి శుక్రవారం పరామర్శించారు. మహేంద్ర తల్లి శ్రీదేవితో మాట్లాడారు. మహేంద్రను ఎస్‌ఐ భూషణం ప్రత్యక్షంగా కారులో ఎక్కించుకుని స్టేషన్‌కు తీసుకెళ్లి అవమానించారని బాలుడి తల్లి తెలిపారు. ఫ్లెక్సీ వివాదంలో ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టారని వాపోయారు. దీనికి కారకులైన ముదునూరి నాగరాజు, బలుపో సతీష్‌లను అరెస్టు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ.. మహేంద్ర ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వ్యవసాయ భూమి ఇవ్వాలన్నారు. ఆయన వెంట కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.సుందర బాబు ఉన్నారు.

➡️