ఎన్నికల ముందు పిఎం కిసాన్‌ నిధుల విడుదలా?

congress-agree-on-modi

మోడీ తీరుపై కాంగ్రెస్‌ అభ్యంతరం
న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు రోజుల ముందు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధులను విడుదల చేయడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఉద్దేశపూర్వంగా జరుగుతుందా.. అని ప్రశ్నించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యర్శి జైరాం రమేష్‌ ట్వీట్‌ చేశారు. ‘పిఎం-కిసాన్‌ కింద 15వ విడత నిధులు బుధవారం విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో రెండు రోజుల్లో, రాజస్థాన్‌లో 10 రోజుల్లో, తెలంగాణలో 15 రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 15వ విడత నిధులు ఈరోజు విడుదలవుతున్నాయి’ అని జైరాం రమేష్‌ తన పోస్ట్‌లో తెలిపారు. పిఎం కిసాన్‌ సమ్మాన్‌ ఆరవ విడత నిధులను ఆగష్టు 1, 2020న, తొమ్మిదో విడత నిధులు ఆగష్టు 9, 2021న, 12వ విడత నిధులు గత సంవత్సరం అక్టోబర్‌ 17 న విడుదల చేశారని జైరాం రమేష్‌ గుర్తు చేశారు. ‘ఈ ఆలస్యం ఉద్దేశపూర్వకంగా కాదా?’ అని జైరాం రమేష్‌ ప్రశ్నించారు.బుధవారం జార్ఖండ్‌లో జరిగిన కార్యక్రమంలో పిఎం కిసాన్‌ పథకం కింద 15వ విడతగా రూ. 18 వేల కోట్లను ప్రధాని మోడీ విడుదల చేశారు.

➡️