ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో ఐఎఎస్, ఐపిఎస్‌లను ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార కులుగా మార్చే ప్రయత్నం చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు.
ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వికసిత్ భారత్ ప్రచారం ద్వారా గిరిజనులు, పట్టణ ప్రాంత పేదలను మభ్య పెట్టేందుకు మన్యం పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు, 124 అర్బన్ ప్రాంతాల్లో మురికివాడల్లో ఉంటున్న పేదల ప్రాంతాలను ఎన్నుకొన్నదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఓట్లు గుంజుకునేందుకే అధికారుల బాధ్యతలను దుర్వినియోగం చేస్తోంద న్నారు. మోడీ హయాంలో దేశం విలాప భారత్‌గా మారుతోందని, కరువు కాటకాలు, ఆత్మహత్యలు, అధిక ధరలు, మహిళలు, దళితులు ఆదివాసీలపై అత్యాచారాలు, నిరుద్యోగంతో భరతమాత విలపి స్తోందని ఆగ్రహించారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ విద్రోహాన్ని, ఆదివాసీలకు చేసిన అన్యా యాన్ని ఎక్కడికక్కడ నిలదీసి ప్రశ్నించాలని కోరారు. అధికారులు ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకూడదని శ్రీనివాసరావు కోరారు.