కార్తీక దీపాలను వెలిగిస్తున్న మహిళలు
శ్రీశైలంలో కార్తీక శోభ
– మొదటి సోమవారం భక్తులతో కిటకిటలాడిన క్షేత్రం
ప్రజాశక్తి – శ్రీశైలం
కార్తీకమాసం సందర్భంగా శ్రీశైల క్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. భక్తులు తెల్లవారుజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులు దీరారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద, ఆలయ ఉత్తర(శివ) మాఢవీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపారాధనలో పలువురు భక్తులు దీపాలు వెలిగించుకొని పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ పుష్కరిణి వద్ద నిర్వహించిన లక్షదీపోత్సవం, పుష్కరిణిహారతి కనులపండువగా సాగింది. సాయంత్రం 6.30 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు ఆశీనులు చేసి అర్చకులు, వేదపండితులు విశేష పూజలు చేశారు. క్షేత్రంలోని కళావేదికపై కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక నత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.