విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలి : సిఐటియు

Nov 4,2024 20:58

ధర్నాలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు

విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలి : సిఐటియు
– కలెక్టరేట్‌ ఎదుట గ్రామ సేవకుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా
ప్రజాశక్తి, నంద్యాల కలెక్టరేట్‌
విఆర్‌ఎల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, నైట్‌ డ్యూటీలు రద్దు చేయాలని, ప్రమోషన్లు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.ఏసురత్నం, ఎ.నాగరాజులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామ సేవకులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అటెండర్‌, వాచ్‌మెన్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, డ్రైవర్‌ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయని, అర్హులైన విఆర్‌ఎలతో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించకుండా మోసం చేసిందన్నారు. టిడిపి ప్రభుత్వం ఎన్నికల ముందు విఆర్‌ఎల సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా విఆర్‌ఎలపై మోపిన నైట్‌ వాచ్మెన్‌ డ్యూటీలను వెంటనే రద్దు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా పే స్కేల్‌ అమలు చేయాలన్నారు. నామినిలను విఆర్‌ఏలుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. అటెండర్‌, వాచ్‌మెన్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, డ్రైవర్‌ పోస్టులలో 70 శాతం విఆర్‌ఎలకు కేటాయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాలయాపనను వీడి విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శివరామ, జిల్లా సహాయ కార్యదర్శి బాల వెంకట్‌, విఆర్‌ఎల సంఘం జిల్లా నాయకులు రామచంద్రుడు, గిరిబాబు, నాగేశ్వరరావు, సలాం, మద్దిలేటి, లక్ష్మన్న, రవికుమార్‌, రామకృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు

➡️