ముగిసిన జలశక్తి శాఖ అత్యవసర సమావేశం

న్యూఢిల్లీ : నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో … కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం ముగిసింది. శనివారం శ్రమ శక్తి భవన్‌లో హైబ్రిడ్‌ మోడ్‌లో తెలుగు రాష్ట్రాల అధికారులతో దాదాపు గంటకుపైగా ఈ సమావేశం జరిగింది. నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద ఉద్రిక్తతలు, తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకాల సమస్యలపై కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను త్వరలో ఎపి, తెలంగాణ అధికారులు విడుదల చేస్తారని సెంట్రల్‌ వాటర్‌ కమీషన్‌ ఛైర్మన్‌ వెల్లడించారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్‌లు), సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు ఛైర్మన్‌లు నేరుగా హాజరయ్యారు. జలాశయాల నిర్వహణ మొత్తం కేఆర్‌ఎంబీకే అప్పగించాలని కేంద్రం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

➡️