ప్రజాశక్తి-వన్ టౌన్ : ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను మాజీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు శనివారం ఉదయం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం వేద పండితులు చంద్రబాబు దంపతులకు వేద ఆశీర్వచనం అందజేశారు. అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సులు కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టాననీ చెప్పారు. రేపు సింహాచలం దర్శనం చేసుకుని, 5న శ్రీశైల దర్శనం, అనంతరం దర్గాకు కూడా వెళతాననీ అన్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాననీ ఆయన చెప్పారు. రాష్ట్రంలో మరల పూర్వవైభవం వచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా ఆశీర్వచనం ఇవ్వమని దుర్గమ్మ వారిని కోరినట్లు చంద్రబాబు చెప్పారు. తన శేష జీవితం ప్రజలకు అంకితం అని అన్నారు. ఈ నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడనని చెప్పారు. ఈ కలియుగంలో త్వరగా ప్రతీదీ మర్చిపోతామని, ఇబ్బంది పెడితే మర్చిపోమని అన్నారు. గచ్చిబౌలీలో జరిగిన ఐటీ ఉద్యోగుల సమీకరణకు ఏకగ్రీవంగా అందరూ వచ్చారన్నారు. తన బాగు కోరి అందరూ అనునిత్యం ప్రార్ధించారు, కొంతమంది ప్రాణ త్యాగాలు చేసారనీ చంద్రబాబు చెప్పారు. శుక్రవారం కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చిన వెంకటేశ్వర స్వామిని ధర్మాన్ని కాపాడటానికి దర్శనం చేసుకున్నానని, ఇవాళ శక్తి స్వరూపిణి దుర్గమ్మ దర్శనం చేసుకుని దుష్టుల్ని శిక్షించమని కోరాననీ ఆయన చెప్పారు. తన కష్టంలో అనేకమంది స్పందించారనీ, విదేశాల్లో సైతం తన కోసం ప్రార్ధనలు చేసారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు వెంట విజయవాడ ఎంపీ కేశీనేని శ్రీనివాస్, తెలుగుదేశం నాయకులు కేశీ నేని శివనాద్, బుద్ధ వెంకన్న, నాగుల్ మీరా, యార్లగడ్డ వెంకట్రావు, మాగంటి బాబు, పంచుమర్తి అనురాధ, ఎం.యెస్. బేగ్, జనసేన నాయకులు పోతిన వెంకట మహేష్ తదితరులు ఉన్నారు.