ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల పేలుడు : సిఆర్‌పిఎఫ్‌ జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో శనివారం ఉదయం జరిగిన నక్సలైట్ల దాడిలో ఇద్దరు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లకు, ఒక మీడియా వ్యక్తికి గాయాలయ్యాయి. గత ఏడాది వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయిన 54 మంది నక్సలైట్ల జ్ఞాపకార్థం నేటి నుంచి డిసెంబర్‌ 8 వరకు పీఎల్‌జీఏ వారోత్సవాలు జరుపుకోనున్నట్లు నక్సలైట్లు కరపత్రాలను విడుదల చేశారు. కొన్ని చోట్ల పోస్టర్లను అంటించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జవాన్లు శనివారం ఉదయం పీఎల్‌జీఏ వారోత్సవాలకు సంబంధిచిన పోస్టర్లను ఆ ప్రాంతం నుండి తొలగిస్తున్నారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌ లోని దంతేవాడలో నక్సలైట్లు.. ఈరోజు ఉదయం సీఆర్పీఎఫ్‌ జవాన్లు టార్గెట్‌ గా ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ పేలుడులో సీఆర్పీఎఫ్‌ 195 బెటాలియన్‌కు చెందిన ఇద్దరు జవాన్లకు, అలానే ఒక మీడియా వ్యక్తికి గాయాలయ్యాయి. కాగా గాయపడిన సీఆర్పీఎఫ్‌ జవాన్లను చికిత్స నిమిత్తం సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

➡️