అవగాహనా ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ఎయిడ్స్ వ్యాధిపై అందరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. అప్రమత్తంగా ఉండడం ద్వారా ఎయిడ్స్‌కు అడ్డుకట్ట వేయొచ్చని చెప్పారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి ఏడురోడ్ల కూడలి మీదుగా బాపూజీ కళామందిర్ వరకు శుక్రవారం నిర్వహించిన అవగాహనా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. బాపూజీ కళా మందిర్‌లో నిర్వహించిన అవగాహనా సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ రక్త మార్పిడి సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. రక్త పరీక్షలు చేసినప్పుడు వైద్య సిబ్బంది జాగ్రత్తలు పాటించాలన్నారు. జిల్లాలో ఎనిమిది వేల మందికి ఎఆర్టి చికిత్స, రెండు వేల మందికి పెన్షన్లను అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి మాట్లాడుతూ హెచ్ఐవి పాజిటివ్ ఉన్నంత మాత్రాన ఎయిడ్స్ ఉన్నట్లు కాదన్నారు. మూడు స్థాయిలు దాటిన తర్వాత ఎయిడ్స్ మారుతుందన్నారు. హెచ్ఐవి రాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులు చికిత్స తీసుకుంటూ మందులు తీసుకోవాలన్నారు. ఎయిడ్స్, లెప్రసీ నివారణ అధికారి అనురాధ జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారితో ఎయిడ్స్ నియంత్రణకు తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, ఎయిడ్స్ వైద్యాధికారి బి.అప్పలనాయుడు, డిఐఒ ఈశ్వరీ దేవి, జిల్లా మాస్ మీడియా అధికారి పి.వెంకటరమణ, ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి ఉమామహేశ్వరరావు, రిమ్స్ ప్రతినిధి పద్మావతి, సమాజ సేవకులు మంత్రి వెంకట స్వామి, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ఎన్సిసి విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.