సమస్యలపై ధ్వజం

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావుప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్నాన ప్రసాదరావు అధ్యక్షతన కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ (డిఆర్‌సి) సమావేశంలో పలు సమస్యలను ప్రజాప్రతినిధులు ప్రస్తావించగా ప్రత్తిపాడు, తాడికొండ, గుంటూరు తూర్పు, మంగళగిరి ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరు కాలేదు. సమావేశం సాదాసీదాగా జరిగింది. కీలకమైన శాఖలపై సుదీర్ఘంగా చర్చించారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణరావు మాట్లాడుతూ గ్రామాలు, పట్టణా ల్లో తాగునీటి శుద్ధికి సంబంధించిన ఫిల్టర్‌ బెడ్ల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ, పట్ణణ ప్రాంతాల్లో తాగునీటి శుద్ధికి నిధులు ఖర్చు చేస్తున్నా ఆశించిన స్థాయిలో నాణ్యమైన నీరు సరఫరా జరగటం లేదన్నారు. పూర్తి స్థాయిలో నీటి శుద్ధికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖలు ప్రతిపాదనలు అందిస్తే ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు.

కరువు మండలాలను ప్రకటించాలి : లక్ష్మణరావు
జిల్లాలో వర్షాభావం తీవ్రంగా ఉన్న మేడికొండూరు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. మిర్చి పైరును మూడు కోతలు కోయాల్సి ఉందని, నీటి ఎద్దడితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని లక్ష్మణరావు ప్రశ్నించారు. అత్యధిక వ్యాపారంచేసే ఎస్‌బిఐ పంట రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదన్నారు. ఎస్‌బిఐ గతంలో రూ.5 కోట్లు ఇచ్చిందని చెప్పారని, కానీ ఇప్పుడు ఒక్క రూపాయికూడా ఇవ్వలేదని రికార్డుల్లో తేటతెల్లమైందని అన్నారు. ఈ అంశంపై త్వరలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని అధికారులన్నారు. గుంటూరు ఛానల్‌ భూసేకరణ పూర్తి చేసేందుకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. గుంటూరు నగరంలో ఆర్‌యుబిలు, గోరంట్ల తాగునీటి పథకం ఇంతవరకు పూర్తి కాలేదన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌కు నీటిసమస్యను తక్షణం పరిష్కరించాలన్నారు. ఆత్మకూరు చెరువు నుంచి నీరివ్వాల్సి ఉన్నా రెండేళ్లుగా ఇవ్వలేకపోయారని అన్నారు. ఇందుకు అధికారులు సమాధానమిస్తూ అటవీశాఖ, జాతీయ రహదారి సంస్థ అధికారులకు లేఖ రాశామన్నారు. అనుమతి ఎప్పటికి వస్తుందని లక్ష్మణరావు ప్రశ్నించారు. గుంటూరులో తాగునీటి ఇబ్బందులను ప్రస్తావించారు.
ప్రవీణ్‌ ప్రకాష్‌ తీరు సరికాదు : ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు
ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ తీరు సరికాదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. పాఠశాలల తనిఖీల సందర్భంగా విద్యార్థుల ముందు ఉపాధ్యాయులను, ఉపాధ్యాయుల ముందు అధికారులను కించపర్చడం దారుణమన్నారు. విద్యార్థులకు సంబంధించిన దుస్తుల విషయంలో కూడా ఉపాధ్యాయులను నిందించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి చిన్న అంశాలకు ఛార్జీ మోమోలు ఇవ్వడం సరికాదన్నారు. పాఠశాలలో విద్యా బోధనను పరిశీలించడంలో తప్పు లేదని, అయితే తనిఖీలు పేరుతో వేధించడం మంచిపద్ధతి కాదని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఎంపి ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి మాట్లా డుతూ ఉపాధ్యాయులు బాగా పనిచేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సిన్సియర్‌ అధికా రితో తనిఖీలు చేయిస్తోందన్నారు. దీనికి లక్ష్మణరావు స్పందిస్తూ తనిఖీలకు తాము వ్వతిరేకం కాదని, ఇష్టానుసారంగా వ్యవహ రించి మనస్తాపానికి గురి చేయడం తప్పని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ప్రవీణ్‌ ప్రకాష్‌ తనిఖీల్లో 32 మందికి ఛార్జీ మోమోలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.

టిడ్కో ఇళ్లు ఎప్పుడిస్తారు? : ఎమ్మెల్యే గిరిధర్‌

గుంటూరులో టిడ్కో ఇళ్లు ఎప్పుడు ఇస్తారని ఎమ్మెల్యే మద్దాలిగిరి ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా మౌలిక సదుపాయాలు పూర్తి చేయలేకపోయారని అన్నారు. తాగునీటి పథకం ఎప్పటికి పూర్తి చేస్తారని ప్రశ్నించారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఎమ్మెల్యేలు కిలారు రోశయ్య, అన్నాబత్తుని శివకుమార్‌ ప్రస్తావించారు. రెండో దశ కాలనీల్లో ఇంత వరకు లెవలింగ్‌ కూడా చేయలేదన్నారు.

తలెత్తుకోలేకపోతున్నాం : ఎమ్మెల్యే శివకుమార్‌
తెనాలిలో రహదారుల అధ్వానంగా ఉండటం వల్ల తాను తలెత్తుకోలేకపోతున్నానని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ అన్నారు. తెనాలి – మంగళగిరి రోడ్డు తెనాలి – వివీఎస్‌ఆర్‌ కళాశాల నుంచి ఆటోనగర్‌ ఉన్న రోడ్లు అధ్వానంగా ఉండటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురు చనిపోతున్నారని చెప్పారు. ఈ రోడ్డుపై కారులో వెళ్తూ కూడా తలెత్తుకోలేక తాను సెల్‌ఫోన్‌ చూసుకుంటున్నానని అన్నారు. ఈ అంశంపై ఎంపి ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ విఎస్‌ఆర్‌ కళాశాల నుంచి ఆటోనగర్‌ రోడ్డుకు ఖర్చయ్యే రూ.10 లక్షలు తాను ఎంపి ఫండ్స్‌ ద్వారా అందిస్తామని, వెంటనే మరమ్మతులు నిర్వహించాలని ఆర్‌ అండ్‌ బి అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ గుంటూరు ఛానల్‌లో మురుగునీరు కలుస్తున్నందున ఛానల్‌కు సమాంతరంగా పైపులైన్లు ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని గ్రామాలకు, పట్టణాలకు తాగునీటి సరఫరా చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే గిరిధర్‌ మాట్లాడుతూ గుంటూరు నగరం ఎక్స్‌ టెన్షన్‌ ఏరియాల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా పైపులైన్లు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో పెండింగ్‌లో ఉన్న ఆర్‌ యూ బీలు , ఆర్వోబీల నిర్మాణం వెంటనే ప్రారంభించాలన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంజనీర్లు ఎం.బుక్‌లు రికార్డు చేయాలన్నారు. అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ పేదలందరికి ఇళ్ల పథకంలో రెండవ ఫేజ్‌లో ఇళ్ళు మంజూరు చేయనున్న లే అవుట్లలోనూ మౌలిక సౌకర్యాల అభివృద్ధి పనులు చేయాలని కోరారు. నాడు-నేడు ఫేజ్‌-2లో పాఠశాలల్లో పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.
ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశాలపై జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ కౌలు రైతులందరికీ పంట రుణాలు మంజూరయ్యేలా బ్యాంకర్లతో నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రతి బ్యాంకుకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాల మంజురుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జెసి జి.రాజకుమారి మాట్లాడుతూ రహదారుల అభివృద్ధికి, అత్యవసర పనులకు మినరల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ను ఉపయోగిస్తామన్నారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ జిల్లాలో గత వ్యవసాయ సీజన్లో ఇబ్బందులేమీ లేకుండా అధిక దిగుబడులు సాధించారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యం కోసం గుర్తించిన 2,500 మందికి 47 వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ నెట్‌ వర్క్‌ ఆసుపత్రుల ద్వారా ఇప్పటికే పూర్తి స్థాయిలో వైద్యంఅందించామని, మిగిలిన 200 మందికి 15 రోజులల్లో వైద్యసేవలను అందిస్తామని చెప్పారు. సాగునీరు ప్రాజెక్టుల క్రింద అప్పట్లో ఇరిగేషన్‌ కెనాల్స్‌ మాత్రమే ఏర్పాటు చేశారని, డ్రెయినేజీ కెనాల్స్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేయలేదన్నారు. ప్రస్తుతం జనాభా పెరగటం వలన వారు వినియోగించిన నీరు సాగునీటి కాల్వల్లో కలవటం వల్ల తాగునీరు కలుషితం అవుతుందన్నారు. రక్షిత నీటి సరఫరాతో సంబంధం ఉన్న ఆర్‌ డబ్య్లు ఎస్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌, పంచాయితీరాజ్‌ శాఖల సమన్వయంతో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించి నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు తీర్మానం చేసినట్టు తెలిపారు. ఆర్‌ అండ్‌ బి రహదారులు మరమ్మతులకు సంబంధించి ప్రజాప్రతినిధుల తెలిపిన అంశాలపై పనులు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్‌పి చైర్‌పర్సన్‌ హెనీక్రిస్టీనా, డిఆర్‌ఒ కె.చంద్రశేఖరరావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కె.స్వాతి, డిసిఎంఎస్‌ఎస్‌ చైర్‌ పర్సన్‌ భాగ్యలక్ష్మీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️