ప్రజాశక్తి-మార్కాపురం రూరల్ : మార్కాపురం డివిజన్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, రైతులను ఆదుకోవాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి రైతు సంఘం నాయకులు ఏరువ పాపిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు గుమ్మ బాలనాగయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు జిల్లాలు, మండలాలలో ఈ ప్రాంతంలోని ఒక్క మండలం కూడా లేకపోవడం దారుణమన్నారు. మార్కాపురం డివిజన్‌లోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ ఈనెల 5న ఉప కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించ నున్నట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సాగు చేసిన అరకొర పంటలు కూడా ఎండిపోతున్నట్లు తెలిపారు. వ్యవసాయ కార్మికులు పనులు లేక వలసలు పోవాల్సిన దుస్థితి ఏర్పడినట్లు తెలిపారు. గొర్రెలు, మేకలకు నీరు లేక పోషకులు వలస బాట పట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో గంగిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రేపని తిరుపతయ్య, కోలగట్ల సత్యనారాయణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.