ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్: ప్రజారోగ్యం మొదటి ప్రాధాన్యత గా జిజిహెచ్‌లో చర్యలు తీసుకుంటామని, పారిశుధ్యం, సౌకర్యాల కల్పనకు తక్షణమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జి.జి.హెచ్లో ఆయన పలు విభాగాలను పరిశీలించారు. గురువారం హెచ్డిసి సమావేశం జరగగా మరుసటి రోజే జిజిహెచ్, వైద్య కళాశాలోని అంశాలపై ఆయన దష్టి పెట్టారు. ఉదయాన్నే మునిసిపల్, ఎపిఎంఎస్ఐడిసి, జిజిహెచ్, మెడికల్ కాలేజీ అధికారులని పిలిపించుకొని పలు విభాగాలను పరిశీలించారు. ఫార్మసీ కోసం ఇంటిగ్రేటెడ్ స్టోరేజ్ స్పేస్ కావాలన్న జిజిహెచ్ అధికారుల విజ్ఞప్తి మేరకు పాత క్యాంటీస్ భవనాన్ని ఆయన పరిశీలించారు. అందుకు సంబంధించి సమాచారం తెప్పించు కొని త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అనంతరం కోవిడ్ సమయంలో నిర్మించిన టెంపరరీ హాస్పిటల్ క్యూబ్స్‌ను పరిశీలించారు. వాటిని నర్సింగ్ విద్యార్థులకి ఎలా ఉపయోగించాలి అనే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని, అందుకు అనుగుణంగా కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డుకు సంబంధించి ప్రత్యామ్నాయ స్థలాన్ని సూచించాలని ఎపిఎంఎస్ఐడిసి ఈఈ విజరు భాస్కర్‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.భగవాన్‌నాయక్, ఆర్‌ఎంఒ డాక్టర్ బి.తిరుమలరావు, మున్సిపల్ కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు, వైద్యులు పాల్గొన్నారు.