మాది రైతు పక్షపాత ప్రభుత్వం

Dec 1,2023 23:35

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: రైతే రాజుగా.. వ్యవసాయం అంటే పండుగలా చేస్తూ జగనన్న ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా పనిచేస్తుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. శుక్రవారం యర్రగొండపాలెంలోని అంబేద్కర్‌ ఆడిటోరి యంలో నియోజకవర్గ వ్యాప్తంగా 103 మంది భూమి లేని నిరుపేద లబ్ధిదారులకు 138 ఎకరాల అసైన్‌మెంట్‌ భూములను, అలాగే 629 మంది లబ్ధిదారులకు 1263 ఎకరాల అసైన్‌మెంట్‌ భూములకు యాజమాన్య హక్కు ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. రూ.50 లక్షల విలువైన 274 తైవాన్‌ స్ప్రేయర్లు, 148 పవర్‌ ట్రిల్లర్లను గిరిజన సంక్షేమ శాఖ, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గిరిజన రైతులకు పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ 20 సంవత్సరాలకు పైగా అసైన్‌మెంట్‌ భూములు కలిగిన రైతులకు వాటికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించి క్రయ, విక్రయాలు చేసుకునేలా ప్రభుత్వం అధికారాన్ని కలిగించడంతో రైతులకు ఎంతో ఉపయోగం కలుగనుందని తెలిపారు. దోర్నాల లో మరొక మార్కెట్‌ యార్డు కమిటిని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమం లో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపిపిలు దొంతా కిరణ్‌ గౌడ్‌, కోట్ల సుబ్బారెడ్డి, కందుల వెంకటయ్య, పెద్ద గుర వయ్య, జడ్పిటిసిలు చేదూరి విజయభాస్కర్‌, చలమయ్య, వైసీపీ మండల కన్వీనర్లు కొప్పర్తి ఓబుల్‌రెడ్డి, బివి సుబ్బారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, సింగారెడ్డి పోలిరెడ్డి పాల్గొన్నారు.

➡️