యువత భవిష్యత్తుపై దెబ్బ కొట్టిన జగన్

యువత భవిష్యత్తు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, కాకినాడజగన్‌ యువత భవిష్యత్తుపై దెబ్బ కొట్టాడనిటిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. తాళ్లరేవు మండలం చొల్లంగిపేట క్యాంప్‌ సైట్‌ నుంచి శుక్రవారం ప్రారంభమైన యువగళం పాదయాత్ర కాకినాడ రూరల్‌, సిటీ నియోజకవర్గాల్లో శుక్రవారం సాగింది. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలని జగన్‌ కోరుకుంటున్నాడని, జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వలేదని, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని, ఏటా ఇస్తామన్న 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదని, గ్రూప్‌-2 డిఎస్‌సి లేదని, ఉన్న అంబేద్కర్‌ స్టడీ సర్కిల్స్‌, బిసి స్టడీ సర్కిల్స్‌ మూసేశాడని, జిఒ 77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్‌ పథకం రద్దు చేసాడని విమర్శించారు. కాకినాడ బాలయోగి విగ్రహం వద్ద మత్స్యకారులు లోకేష్‌ను కలిసి ఇచ్చారు. వారితో మాట్లాడుతూ ఇక్కడ అత్యధిక జనాభా కలిగిన మత్స్యకారుల సంక్షేమాన్ని జగన్‌ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. కుర్చీలేని కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఎటువంటి నిధులు కేటాయించకుండా దగా చేసిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రవాణా అధికారులు గ్రీన్‌ ట్యాక్స్‌, రోడ్‌ ట్యాక్స్‌, ఇన్సూరెన్స్‌ రూపాల్లో వాహనాలను దోచేస్తున్నారని తనను కలవడానికి వచ్చిన లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక వైసిపి ప్రభుత్వంలో పెంచిన పన్నులను సమీక్షించి లారీ ఓనర్లకు ఉపశమనం కలిగిస్తామన్నారు. గతంలో రూ.3వేలు ఉండే ట్యాక్స్‌ ను రూ.3,600కు పెంచి, గ్రీన్‌ ట్యాక్స్‌ రూ.6 వేలకు పెంచారని విమర్శించారు. రోడ్లన్నీ గుంతలమయంగా మారినా నాలుగున్నరేళ్లుగా తట్టెడు మట్టికూడా పోయడం లేదన్నారు. కామాక్షిదేవి గుడివద్ద అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌, ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. సాయంతం కాకినాడ రూరల్‌ సర్పవరం జంక్షన్‌లో జరిగిన బహిరంగ సభలో లోకేష్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైసిపి పాలనలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. వైసీపీ నేతలు చేస్తున్న దోపిడీలను ఎండగట్టారు. అక్రమాలపై విమర్శలు గుప్పించారు. కాకినాడ సిటీ, రూరల్‌ ఎంఎల్‌ఎలపై తీవ్ర విమర్శలు చేశారు. రూరల్‌ నియోజకవర్గాన్ని అభివద్ధి చేస్తారని కన్నబాబుని ప్రజలు గెలిపించగా అభివద్ధి శూన్యమన్నారు అవినీతిలో జగన్‌ను మించిపోయేసరికి కన్నబాబు మంత్రి పదవి పోయిందన్నారు. కాంట్రాక్టులన్నీ కన్న తండ్రి, తమ్ముడే చేస్తున్నారన్నారు. ఏ పని జరగాలన్నా తండ్రికో, తమ్ముడుకో కప్పం కట్టాల్సిందేనని ఆరోపించారు. సెంటు స్థలాల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. ఎంఎల్‌ఎ తమ్ముడు వేధింపులు తట్టుకోలేక ఈ మధ్యే డాక్టర్‌ కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. కాకినాడ సిటీలో అభివద్ధి లేదని, ఎంఎల్‌ఎ చంద్రశేఖర్‌ రెడ్డి కుటుంబం మాత్రం బాగా అభివృద్ధి చెందిందన్నారు. సిటీని డ్రగ్స్‌, అవినీతి, భూకబ్జాలు, సెటిల్మెంట్స్‌, మద్యం అక్రమ రవాణా, పేకాట క్లబ్స్‌కు అడ్డాగా మార్చేశాడని ధ్వజమెత్తారు. స్మార్ట్‌ సిటీ నిధులు కాజేశాడన్నారు. పెన్షనర్స్‌ పారడైజ్‌ను గంజాయి పారడైజ్‌గా మార్చారన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో మడ అడవులు ధ్వంసం చేశాడన్నారు.

➡️