హత్య కేసు విచారణలో అధికారుల నిర్లక్ష్యం తగదు

Dec 1,2023 22:08

 సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు నాయకులు, బాధితులు

           హిందూపురం :హిందూపురం రూరల్‌ మండలం కొటిపి గ్రామంలో బోయ నాగరాజు హత్య కేసు విచారణలో స్థానిక పోలీసులతో పాటు తహశీల్దార్‌ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిఐటియు నాయకులు రాము, ఎస్‌, ఎస్‌టి, బిసి, మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పార్వతమ్మతో పాటు మృతుడు నాగరాజు బంధువులు ఆరోపించారు. ఈ మేరకు వారు శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. నవంబర్‌ 3న బోయ నాగరాజును కొంత మంది ఒక పథకం ప్రకారం హత్య చేశారన్నారు. ఈ విషయం హత్య జరిగిన కొన్ని రోజులకు బయటకు వచ్చిందన్నారు. దీంతో స్టేషన్ల చుట్టూ తిరిగినప్పటికి న్యాయం జరగక పోతే గత నెల 18న తహశీల్దార్‌ కార్యాలయం ముందు ఆందోళన చేస్తే పోలీసులు కేసు నమోదు చేసి, మృత దేహాన్ని బయటకు తీసి పంచనామా చేశారన్నారు. పంచనామా జరిగి 11 రోజులు గడిచినప్పటికి మృత దేహం నుంచి సేకరించిన శాంపిల్స్‌లను ఇంత వరకు ల్యాబ్‌కు పంపలేదన్నారు. ఈ విషయాన్ని తహశీల్దార్‌ను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని విమర్శించారు. మెడికల్‌ సూపరింటెండెంట్‌ను అడిగితే పోలీసులు రిపోర్టు ఇవ్వక పోవడంతో తాము ల్యాబ్‌కు పంపలేదని అంటున్నారన్నారు. ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. అయితే నాగరాజును పక్కాగా పథకం ప్రకారం హత్య చేశారని విమర్శించారు. ఈ హత్యను రెవిన్యూ, పోలీసు అధికారులు సాధారణ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ విషయంపై హత్యకేసు నిందితులు ఇప్పటికే గ్రామంలో ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు. అధికారులకు ఎవరికి ఇవ్వాల్సిన వాటా వారికి ఇచ్చామని దిక్కున్న చోటుకు పోవాలని చెప్పుకుంటు తిరుగుతున్నారని వారు ఆరోపించారు. ఇచ్చిన ఫిర్యాదులను సైతం అధికారులు తారు మారు చేస్తున్నారని విమర్శించారు. కుల ఆధిపత్యం కోసం జరిగిన ఈ హత్యపై ఉన్నతాధికారులతో విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. తమకు న్యాయం జరగక పోతే రాష్ట్ర హై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ సమావేశంలో మృతుడి తండ్రి నారాయణప్ప, అత్త గంగమ్మ, మామ సోమయ్య, అన్న బాలయ్య, అక్క కవిత, బాబారు గంగప్పతో పాటు బంధువులు పాల్గొన్నారు.

➡️