ప్రజాశక్తి – బలిజిపేట : తమ ప్రభుత్వం రైతు పక్షపాతని, వీరిని అన్ని విధాలా ఆదుకొని వారి అభివృద్ధికి కృషి చేస్తుందని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మండలంలోని అరసాడలో గల రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలును శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో గల 56 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. 2023-24 ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వ మద్దతు ధర సాధారణ రకం ధాన్యం కింటాకు రూ. 2183, ఏ గ్రేడ్ రకం రూ. 2203కు ప్రభుత్వం ధర నిర్ణయించినట్లు తెలిపారు. కావున రైతులు మధ్యవర్తిని కూడా ఆశ్రయించ కుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే అమ్ముకోవాలని సూచించారు. అనంతరం ధాన్యం బస్తాల ట్రాక్టర్ల లోడ్లను జండా ఊపి రైస్ మిల్ కేంద్రాలకు పంపించారు. కార్యక్రమంలో ఎంపిపి జి.నాగమణి, జెడ్పిటిసి ఎ.రవికుమార్, మండల వైసిపి అధ్యక్షులు పి.మురళీకృష్ణ, ఎఒ ఎ.శ్రావణ్ కుమార్, తహశీల్దార్ పి.అప్పలరాజు, ఎస్సై ఎన్ ప్రశాంత్ కుమార్, మూడు మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక సర్పంచ్, పాల రామకృష్ణ, ఎంపిటిసి సభ్యులు గుల్ల ప్రభావతి, పలువురు సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, పాల్గొన్నారు