ఓటు హక్కు నమోదుకు చర్యలు : కలెక్టర్‌

ప్రజాశక్తి – ఏలూరు

జిల్లాలో 18 ఏళ్లు దాటిన యువతను గుర్తించి ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి శుక్రవారం ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించిన (డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌) రోజున పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ప్రత్యేకంగా 30 రోజులకుపైగా పెండింగ్‌లో ఉన్న ఫారాలు, ఎస్‌ఎస్‌ఆర్‌-2024 సమయంలో స్వీకరించిన ఫారాలు, అనోమలిస్‌ పెండింగ్‌, ముసాయిదా జాబితాపై ఓట్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, పెండింగ్‌ ఉన్న రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఇ-రోల్‌పై రిపోర్ట్‌లు, ఎపిక్‌ కార్డుల జనరేషన్‌, పంపిణీ, పిఎస్‌ఇలు, డిఎస్‌ఇలు, నోడల్‌ అధికారులు, సెక్టార్‌ అధికారులు, సెక్టార్‌ పోలీసు అధికారుల నియామకం, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్‌ హాలు నుంచి పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అర్హత ఉన్న యువతను గుర్తించేందుకు జూనియర్‌, ఇతర కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఐసిడిఎస్‌ వద్ద ఉన్న డేటాను అనుసంధానం చేసుకుని ఓటుహక్కు అర్హత పొందుతున్న యువతను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఈనెల రెండు, మూడు తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం అన్ని పోలింగ్‌ స్టేషన్లలో నిర్వహించి అర్హులను నమోదు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించేనాటికి 312 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ముసాయిదా జాబితా ప్రకటించిన అనంతరం అందిన 6,7,8 దరఖాస్తుల్లో చేర్పులు, మార్పులు, తొలగింపుల కోసం 45,042 దరఖాస్తుల్లో ఇంకా 12,150 పరిష్కరించాల్సి ఉందన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన నాటికి 15,88,622 మంది ఓటర్లు నమోదె ౖఉండగా చేర్పులు, మార్పులు, తొలగింపులు తర్వాత గతనెల 30 నాటికి 15,96,711 మంది ఓటర్లు నమోదయ్యారని తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి 16 మంది నోడల్‌ అధికారులను, 206 మంది సెక్టార్‌ అఫీసర్లు, 206 మంది సెక్టార్‌ పోలీస్‌ అధికారులను నియమించామన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు, ఇఆర్‌ఒలు నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌, జెడ్‌పి సిఇఒ సుబ్బారావు, ఏలూరు ఆర్‌డిఒ ఖాజావలి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు జివివి.సత్యనారాయణ, కె.బాబ్జి, గీతాంజలి, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి బి.రమాదేవి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ చల్లన్న దొర, ఎఇఆర్‌ఒ బి.సోమశేఖర్‌ పాల్గొన్నారు.

➡️