ఏడుగురు కార్మికుల సజీవ దహనం
24 మందికి గాయాలు
అహ్మదాబాద్ : గుజరాత్ సూరత్ పట్టణంలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయపడ్డారు. నగరంలోని సచిన్ ఇండిస్టియల్ ప్రాంతంలోని ఏథర్ ఇండిస్టీస్ లిమిటెడ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో బుధవారం ఈ ప్రమాదం సంభవించగా, గురువారం తెల్లవారుజామున మృతదేహాలను గుర్తించినట్లు సూరత్ జిల్లా కలెక్టర్ ఆయూష్ ఓక్ తెలిపారు. మృతుల్లో ఒకరు సంస్థ ఉద్యోగి కాగా, మిగిలిన ఆరుగురు కాంట్రాక్టు కార్మికులు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో నిర్వహించిన తనిఖీల్లో మృతదేహాలను కనుగొన్నారు. మృతులను దివ్యేష్ పటేల్ (కంపెనీ ఉద్యోగి), సంతోష్ విశ్వకర్మ, సనత్ కుమార్ మిశ్రా, ధర్మేంద్ర కుమార్, గణేష్ ప్రసాద్, సునీల్ కుమార్, అభిషేక్ సింగ్‌లుగా అధికారులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన 24 మంది ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని కలెక్టర్ తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కెమికల్ ప్లాంట్‌లో ఒక భారీ ట్యాంక్‌లో నిల్వ ఉంచిన మండే రసాయనాలు లీకేజీ కావడంతో పేలుడు సంభవించిందని, వెంటనే మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. 15 ఫైరింజన్లు తొమ్మిది గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.