ప్రజాశక్తి-కొండపి : పొగాకు పొగాకు నాణ్యత పెంపుదలపై రైతులు దృష్టి సారించాలని వేలం నిర్వహణాధికారి జి.సునీల్‌కుమార్ తెలిపారు. కొండపి పొగాకు వేలం కేంద్రం పరిధిలోని రామాయపాలెం గ్రామంలో పొగాకు బోర్డు సిబ్బంది పొగాకు పంట నియంత్రణ మరియు ఇతర ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. తొలుత పొగాకు తోటలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వేలం నిర్వహణాదికారి మాట్లాడుతూ పొగాకు గతేడాది ఉన్న డిమాండ్ ప్రస్తుతం ఉంటుందని చెప్పలేమన్నారు. రైతులు పొగాకు సాగు విస్త్రీరాన్ని తగ్గించి ఇతర పంటల వైపు దృష్టి సారించాలన్నారు. పొగాకు పంట చుట్టూ ఎర పంటలైన ఆముదం, బంతి, అవరోధ పంటలై జొన్న మరియు మొక్క జొన్న సాగు చేయడం ద్వారా చీడపీడల ఉధృతిని అరికట్టవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు బంతి నారును ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ గ్రేడింగ్ అధికారి సాయికుమార్, గ్రామ సర్పంచి మల్లసాని నాగేశ్వరరావు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.