ప్రజాశక్తి – వినుకొండ : నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 2 వేల ఎకరాలకు పొలాలకు భూహక్కు పట్టాలను కలెక్టర్ ఎల్.శివశంకర్, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గురువారం పంపిణీ చేశారు. పట్టణంలోని కారంపూడి రోడ్డులోని కళ్యాణమండపంలో నిర్వహించిన కార్యమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పొలాలను 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వారిని ప్రభుత్వం గుర్తించి పట్టాలిస్తోందన్నారు. నిషేధిత భూముల జాబితా నుండి వాటిని తొలగించి సర్వ హక్కులనూ సాగుదార్లకు ఇస్తోందన్నారు. ఇదే క్రమంలో 20 ఏళ్ల క్రితం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన డీకే పట్టాలకు ఆయా భూమలును వారు అమ్ముకునే హక్కులనూ ప్రభుత్వం కల్పించిందన్నారు. నియోజకవర్గంలో 17 వేల ఎకరాల చుక్కల భూములను నిషేధిత భూముల జాబితా నుండి తొలగించి రైతులకు హక్కులు కల్పించామని, గతంలోనే పట్టాలనూ అందించామని గుర్తు చేశారు. భూ రీ సర్వే ద్వారా ప్రతి రైతుకు భూమి హక్కులు వస్తున్నాయని, అన్ సెటిల్మెంట్ భూ సమస్యలనూ త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. వినుకొండలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి జీవో వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలకు భూ పట్టాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.