ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : దళితులు, గిరిజనులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ఆధ్వర్యంలో 4న నిర్వహించే చలో ఢిల్లీని జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి పిలుపునిచ్చారు. ఈ మేరకు గుండిమెడలో గురువారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక, దళితులు, గిరిజనులపై దాడులు పెరిగాయన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని అమలు చేయకుండా నీరుగార్చేందుకు కుట్ర చేశారని మండిపడ్డారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, మనువాదాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో మతోన్మాద బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితులు, గిరిజనలు, పేదలు చలోఢిల్లీకి తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పి.కృష్ణ, పొట్టయ్య, నాని, మేరమ్మ, సాంబయ్య పాల్గొన్నారు.