ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న తమను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీని సిఎం జగన్మోహన్రెడ్డి నెరవేర్చాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. దీనిపై తాము ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోవడం లేదని, గొంతు చించుకుని అడుగుతున్నా కనికరించడం లేదని ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ మేరకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గురువారం నరసరావుపేటలోని పురపాలక సంఘం కార్యాలయం వద్ద నుండి ఆర్డీవో కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా యూనియన్ పల్నాడు జిల్లా గౌరవాధ్యక్షులు సిలార్ మసూద్ మాట్లాడుతూ కార్మికుల్లో 99 శాతం మంది దళితులే ఉన్నారని, వీరికి న్యాయం చేయకుండా నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ సిఎం ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. నరసరావుపేటలో మున్సిపల్ కౌన్సిల్ లేకపోవడం వల్ల కార్మికులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్నారు. యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ.సాల్మన్ మాట్లాడుతూ ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయాలని కనీస వేతనం రూ.26 వేలు, కొబ్బరి నూనె, చెప్పులు, సబ్బులు, బట్టలు ఇవ్వాలని కోరారు. చనిపోయిన కార్మికుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని, కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కార్మికుని పిఎఫ్ డబ్బులు నామినికి చెల్లించాలని, చనిపోయిన కార్మికులకు మట్టి ఖర్చులు వెంటనే ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ సిహెచ్.వి నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మల్లయ్య, యోహాను, నాయకులు పి.ఏసు, కృపారావు, నరసింహారావు, పి.జాన్, జీవరత్నం, విజయమ్మ, లుదియమ్మ, కార్మికులు పాల్గొన్నారు.