ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధినీటి పారుదల శాఖలో లస్కర్ల కొరత వేధిస్తోంది. తూర్పు, మధ్య డెల్టా, హెడ్ వర్క్సు, పెద్దాపురం, ఏలేశ్వరం డివిజన్ల పరిధిలో 487 మంది లస్కర్లు అవసరం కాగా కేవలం 120 మందితో నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 431 కిలోమీటర్ల ప్రధాన కాల్వలు ఉన్నాయి. మరో 2024 కిలోమీటర్ల మేర అనుసంధానమైన చిన్నకాల్వలు ఉన్నాయి. ఈ కాల్వల పరిధిలో ఉభయ గోదావరి జిల్లాల్లో 8.96 లక్షల ఎకరాల్లో ఆయకట్టుకు సాగు నీరందిస్తున్నారు. ఈ ఏడాది రబీ సాగుకు, తాగునీటి అవసరాలకు 92 టిఎంసిలు అవసరం కాగా దశలవారీగా 82 టిఎంసిల నీరు అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. రబీ ముందస్తు సాగు చేపట్టి జనవరి మొదటి వారం నాటికే నాట్లు పూర్తి కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా సాగు చేపట్టకపోతే చివరిదశలో పంట దెబ్బ తినే అవకాశం ఉందనే హెచ్చరిక చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో లస్కర్ల విధులు కీలకం కానున్నాయి. సాగునీటి కాలువలకు నీటి విడుదల, గోదావరి వరదల సమయంలో క్షేత్రస్థాయిలో లస్కర్ల పనితీరు అత్యంత కీలకం. కాలువల నుంచి పిల్లకాలువలకు నీటి మల్లించేందుకు వినియోగించే న్లూయిజ్‌లు, కల్వర్టులు, బ్యారేజికి ఉండే గేట్ల పనితీరు, షట్టర్లు, హెచ్ స్లూయీజ్‌లు వంటి మరమ్మతులు, నీటి విడుదల సమయంలో ఎంతమేరకు నీటిని సరఫరా అవసరమో ఆ మేరకు విడుదల చేస్తుంటారు. అదే విధంగా గోదావరి గట్లు ఎక్కడ ఎక్కడ బలహీనంగా ఉన్నాయి వంటి అనేక పనులు పర్యవేక్షణ లస్కర్లు నిర్వహిస్తుంటారు. రైతులకు అధికారులకు మధ్య రాత్రింబగళ్లూ అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో లస్కర్ క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో లస్కర్ల పోస్టులు భర్తీ చేయకపోవడంతో రబీసాగుపై ప్రభావం తప్పదనే సంకేతాలు విన్పిస్తున్నాయి. వరదల సమయంలోనూ పైస్థాయిలో ఉన్న ఎఇ, డిఇ స్థాయి అధికారులకు పంట కాలువల పరిస్థితులపై ఎప్పటికప్పుడు లస్కర్లు సమాచారం అందిస్తుంటారు. లాకులు ఎత్తడం దించడం వంటి కార్యక్రమాలను అర్ధరాత్రులు సైతం అధికారుల ఆదేశాల మేరకు చేస్తుంటారు. వాస్తవానికి వీరు చేసే పని ఎక్కువ, వీరికి కేటాయించిన జీతం చాలా తక్కువే. ప్రతి ఏటా 8 నెలలు కాంట్రాక్టు పద్ధతిన ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంటుంది. కేవలం రూ10,500 చొప్పున చెల్లిస్తోంది. ఈ వేతనాలు సైతం మూడు లేక ఐదు నెలలకోసారి అందజేయటం గత రెండేళ్లుగా పరిపాటిగా మారింది. అయితే విధి నిర్వహణ ఎంత కష్టమైనప్పటికీ ఏదో ఒక రోజు ప్రభుత్వం పర్మినెంట్ చేస్తుందని లస్కర్లు తమ విధులు కష్టమైనా ఇష్టంగా చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి లస్కర్ల పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని రైతులు, రైతు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.