ప్రజాశక్తి -కాకినాడ
ఆధునిక సమాజంలో జరుగుతున్న యుద్ధాలకు కారణం అమెరికన్ సామ్రాజ్యవాదమే అని ఎల్‌ఐసి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పి. సతీష్ అన్నారు. కాకినాడ యుటిఎఫ్ హోంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ‘సామ్రాజ్యవాదం – యుద్ధోన్మాదం’ అనే అంశంపై గురువారం సదస్సు జరిగింది. మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సతీష్ మాట్లాడుతూ మొదటి, రెండవ ప్రపంచ యుద్దాలు జరిగిన నేపథ్యం, తదనంతరం నానాజాతి సమితి, ఐక్యరాజ్యసమితి ఏర్పడిన పరిస్థితులను వివరించారు. 2వ ప్రపంచ యుద్ధకాలంలో రష్యన్ సోషలిస్టు ప్రభుత్వం, ప్రజలు చేసిన త్యాగంతోనే ప్రపంచ శాంతి ఏర్పడిందన్నారు. 1991 తరువాత యుఎస్‌ఎస్‌ఆర్ కూలిపోయాక అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఎదురు లేకుండా పోయిందన్నారు. అమెరికన్ ఆయుధ వ్యాపారుల లాభాల కోసమే యుద్ధాలు, యుద్ధ వాతావరణం కల్పించబడుతుందన్నారు. ఇటీవల జరిగిన ఉక్రెయిన్ రష్యా యుద్ధం గాని, తాజాగా పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ మారణహోమానికి గాని కారణం అమెరికన్ సామ్రాజ్యవాదమే అన్నారు. నేడు ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఉద్యమాల్లో ప్రజలు, ప్రజా సంఘాలు భాగస్వాములు కావాలన్నారు. సదస్సుకి ముందుగా గురజాడ కథానికలను రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయులు పిఎస్ ప్రకాశరావు పరిచయం చేశారు. నేటికీ సమాజంలో రుగ్మతలు తొలగించడానికి గురజాడ అవసరం ఉందన్నారు. ఆయన రచనలను అధ్యయనం చేయాలన్నారు. ఆర్‌విఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్. గోవిందరాజులు మాట్లాడుతూ ప్రతి నెలా జరుగుతున్న సదస్సులో అభ్యుదయ ప్రజాస్వామ్య వాదులంతా పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు జిఎస్.వర్మ, యుటిఎఫ్ నాయకులు బి.ధర్మరాజు, తానీషా పాల్గొన్నారు.