ప్రజాశక్తి – కాకినాడ
రాజ్యాంగం కల్పించిన నిరసన తెలియజేసే హక్కుని కాకినాడ కలెక్టరేట్ వద్ద కొనసాగించాలని కోరుతూ కాకినాడ అఖిల పక్ష నాయకులు జాయింట్ కలెక్టర్ ఇళక్కి యాకి వినతిపత్రం అందించారు. ఈ సంద ర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ 2021 డిసెంబర్ నెలలో ఏ రాజకీయ పార్టీకి, ఏ ప్రజా సంఘానికి సమాచారం ఇవ్వకుండా కాకినాడ ఆర్‌డిఒ తూతూ మం త్రంగా సమావేశం నిర్వహించి ధర్నా చౌక్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని తెలి పారు. రాష్ట్ర ప్రభుత్వం ర్యాలీలు, ధర్నా లను నిషేధిస్తూ తీసుకువచ్చిన జీవో నెంబర్ ఒకటిని రాష్ట్ర హైకోర్టు కొట్టి వేసిన తర్వాత కూడా కాకినాడ కలెక్టరేట్ వద్ద నిషేధ ఉత్తర్వు లను అనధికారికంగా అమలుచేస్తూ ప్రజా సంఘాల నాయకులను, రాజకీయ పార్టీల నాయకులను నిర్బంధిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో జిల్లా ఎస్‌పిని కలవగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. అయితే క్రింది స్థాయి పోలీసు అధికారులు మాత్రం చట్ట ధిక్కరణకు పాల్పడడం, హైకోర్టు ఆదేశాలను, రాజ్యాంగం కల్పించిన నిరసన తెలియజేసే హక్కును కాలరాస్తు వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. అధికార పార్టీకి ఎటువంటి ఆటంకాలు లేవని, స్వేచ్ఛగా ర్యాలీలు, నిరసనలు నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలకు, ప్రజా సంఘాల కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారని వివరించారు. కలెక్టరేట్ వద్ద నిరసన తెలియచేసేలా చర్యలు తీసుకోవాలని జెసిని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు దువ్వా శేషబాబ్జి, పప్పు ఆది నారాయణ, నరాల శివ, పిట్టా వరప్రసాద్, రాయుడు మోజెస్, గదుల సాయిబాబు, చెక్కల రాజ్ కుమార్, మలకా రమణ, తోకల ప్రసాద్, తాళ్లూరి రాజు, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, చంద్రమళ్ల పద్మ, నర్ల ఈశ్వరి, మేడిశెట్టి వెంకటరమణ పాల్గొన్నారు.