జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ప్రభాకర్‌ప్రజాశక్తి- బంగారుపాళ్యం: గొర్రెల పెంపకంలో తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ప్రభాకర్ అన్నారు. సహాయ సంచాలకులు విజరు మోహన్ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రంలో గొర్రెల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాభదాయకమైన గొర్రెల పెంపకాన్ని చేపట్టాలని, గొర్రెల పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన పెంచుకోవాలని తెలిపారు. రైతులు మందలో జాతి లక్షణాలు కలిగిన విత్తనపు పొట్టేలు ఉండేలా చూసుకోవాలని అంటువ్యాధుల భారిన పడిన జీవాలను మంద నుండి వేరు చేసి చికిత్స అందించడం ద్వారా గొర్రెల మరణాల శాతం తగ్గించవచ్చని తెలిపారు. గొర్రెలలో పారుడు వ్యాధి, గాలికుంటు వ్యాధి, చిటుక రోగం, బొబ్బవ్యాధి, నీలి నాలుక, ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్ వంటి వ్యాధులపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. నంద్యాల జిల్లా, ప్యాపిలికి చెందిన పశు వైద్యులు డాక్టర్ శ్రీనివాసులు, మాస్టర్ ట్రైనర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకులు అమర్నాథ్, మోహన్ బాబు, గొర్రెల పెంపకదారులు, పశువైద్య సిబ్బంది, గోపాలమిత్రలు పాల్గొన్నారు.