ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: కర్ణాటక రాష్ట్రంలో ప్రాముఖ్యత కలిగిన కవి భక్త కనకదాస అని జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ తెలిపారు. కనకదాస జయంతి సందర్భంగా గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో భక్త కనకదాస జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్త కనకదాస చిత్రపటానికి జిల్లా కలెక్టర్, డిఆర్ఓ ఎన్.రాజశేఖర్, బిసి వెల్ఫేర్ అధికారి రబ్బాని బాషా, బిసి కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి, కురబ కార్పొరేషన్ డైరెక్టర్ అమరనాథ్, తదితరులు నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ కనకదాస కన్నడ నాట గొప్ప కవి అని, దైవ చింతనలతో గొప్ప కావ్యాలను రచించారని, తత్వవేత్త అని అన్నారు. కర్ణాటక రాష్ట్రం ఉడిపి దేవాలయంలో కనకదాసకు శ్రీకష్ణుడు దర్శనభాగ్యం కల్పించినట్లు చెప్పుకుంటారన్నారు. కనకదాస పేరు పైన ఉడుపిలో స్థూపం ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కనకదాస జయంతి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో బిసి సంక్షేమశాఖ అధికారులు, సిబ్బంది, కురబ సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.