ప్రజాశక్తి – యర్రావారిపాలెంమండలంలోని ఉదయమాణిక్యం పంచాయతీలో ప్రభుత్వ భూమి ఆక్రముణకు గురైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు మీడియాకు అందించిన రహస్య సమాచారం మేరకు.. మర్రి మాకులపల్లి సమీపంలో గానుగుచింత రోడ్డు పక్కన పెద్దకరివేపాకు గుట్టకు ఎదురుగా ఉన్నటువంటి చిన్నమల్లుకుంట పై అదే గ్రామానికి చెందిన కొంతమంది కన్ను పడింది. దీంతో రెవెన్యూ సహకారంతో చిన్నమల్లు కుంట నీటి చెరువును వారం రోజుల కింద ట్రాక్టర్లతో మట్టి తోలి చదును చేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిపై స్థానికులు సమాచారం అందించడంతో పరిశీలించగా రెవెన్యూ రికార్డు ప్రకారం ఆక్రమించుకున్న భూమి చెరువు ( చిన్నమల్లు కుంటచెరువు)గా రికార్డుల్లో ఉంది. దశాబ్దాల కాలంగా పేద రైతులు ఈ చెరువు నీటిని ఉపయోగించుకొని పంటలు పండించుకుంటున్నారు. అలాంటి చెరువును ఈరోజు రెవెన్యూ అధికారుల సహకారంతో చెరువులో మట్టి తోలి చదును చేసి ఆక్రమించుకుంటున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆక్రమించుకున్న చెరువు భూమి దాదాపు 5 ఎకరాలు ఉంటుందని అంచనా. దీనిపై సంబంధిత రెవెన్యూ అధికారిని వివరణ కోరగా పొంతనలేని సమాధానం చెబుతూ మాట దాటవేయడం గమనార్హం. అయితే రెవెన్యూ అధికారుల సాక్షిగానే విఆర్ఒకు భారీగా ముడుపులు అందించే చెరువును పూడ్చి ఆక్రమించుకునే ప్రయత్నం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు విచారణ జరిపి చెరువును కాపాడాలని, లేనిపక్షంలో ఆర్డిఒ, కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.