ప్రజాశక్తి-రాయచోటి టౌన్ అంగన్వాడీల ధీరకాల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 8వ తేదీ నుంచి మెరుపు సమ్మెను చేపట్టనున్నామని అంగన్వాడీ యూనియన్ (సిఐటియు) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీలక్ష్మి, రాజేశ్వరి, అంగన్వాడీ యూనియన్ (ఎఐటియుసి) జిల్లా కో-కన్వీనర్ సరోజ, ఐఎఫ్టియు జిల్లా నాయకులు మస్రూన్బీ పేర్కొన్నారు. గురువారం సిఐటియు జిల్లా కార్యాలయంలో మూడు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజేశ్వరి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాతాశిశుమరణాల రేటు అరికట్టడానికి ఏర్పాటు చేసిన ఐసిడిఎస్కు బడ్జెట్ కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ప్రయివేట్ పరం చేయడానికి నూతన విద్యా విధానం తీసుకొచ్చారని తెలిపారు. వర్కర్లు గట్టి పోరాటాలతో తిప్పికొట్టారని పేర్కొన్నారు. ఇప్పటికీ లక్షల సంఖ్యలో రక్తహీనత. ఫౌష్టికాహార లోపంతో భాధపడేవారున్నారని చెప్పారు. కొత్త సెంటర్లు ఏర్పాటు చేయకుండా కార్పెట్ సేవలో పాలక, ప్రతిపక్షాలు మునిగితేలుతున్నాయని విమర్శించారు. కోశాధికారి బంగారుపాప, వర్కింగ్ ప్రెసిడెంట్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్నాటక, హర్యాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ధరలకనుగుణంగా కనీసవేతనాలు, రిటైర్మెంట్ భెనిఫిట్స్, గ్రాట్యూటీ అమలు చేస్తున్నా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయలేదని పేర్కొన్నారు. సెంటర్ల నిర్వహణకు అంగన్వాడీలు అప్పులు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం గుర్తించి పెండింగ్ జీతాలు బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎఐటియుసి జిల్లా కో-కన్వీనర్ సరోజ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో అంగన్వాడీలు ప్రతి నెలా జీతం వస్తుందన్న విశ్వాసం లేదన్నారు. సెంటర్ల అద్దెలు ఇవ్వలేనప్పుడు ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించాలన్నారు. ఐఎఫ్టియు జిల్లా నాయకులు మస్రూన్ బీ మాట్లాడుతూ ఐక్య ఉద్యమాలతో అంగన్వాడీల సమస్యల సాధనకు ప్రతి ఒక్కరూ నడుమ బిగించాలని పిలుపునిచ్చారు. సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాల మద్ధతు కోరతామన్నారు. సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, నాయకులు ఓబులమ్మ, ఖాజాబి, గౌరి, సిద్దమ్మ, సుకుమారి, అమ్మాజీ, భూకైలేశ్వరి, కుమారి, ఎఐటియుసి నాయకులు స్వర్ణ, పద్మావతి, సుజాత పాల్గొన్నారు. చిట్వేలి: అంగన్వాడీల సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి ఎదూరి సుజాత అన్నారు. స్థానిక సిడిపిఒ రాజేశ్వరిని కలిసి సమ్మె నోటీసు అందించారు. కార్యక్రమంలో నాయకులు దేవి, సుబ్బరత్న, పి.లక్ష్మి కుమారి, శాంతమ్మ, మాధవి పాల్గొన్నారు.