ప్రజాశక్తి -ఏలూరు అర్బన్
కొల్లేరు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే మూడో కాంటూరుకు కుదిస్తామని ప్రభుత్వాలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వివిధ పార్టీల, ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో గురువారం స్థానిక పవర్‌పేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో కొల్లేరు ఎకో సెన్సిటివ్ జోన్’పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కొల్లేరు ప్రజల సమస్యలపై సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.లింగరాజు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, కొల్లేరు పెద్దలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కొల్లేరు ఎకో సెన్సిటివ్‌జోన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఐదో కాంటూరును దాటి పది కిలోమీటర్ల వరకూ పర్యావరణం పేరుతో 26 నిబంధనలు పెట్టి వేలాదిమంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని, దీని వల్ల ఆ ప్రాంతంలో ఉన్న దళితులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, మత్స్యకారులు, ఇతర వృత్తిదారులు, పేదలకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2006లో అప్పటి ప్రభుత్వాలు కొల్లేరు ఆపరేషన్ పేరుతో జిరాయితి, సొసైటీ చెరువులను నాడు ధ్వంసం చేసి కొల్లేరు ప్రజల్ని అనాధలను చేస్తే నేడు మళ్లీ కొల్లే లరు ఎకో సెన్సిటివ్ పేరుతో ఐదో కాంటూరుపైన ఉన్న 89 గ్రామాల ప్రజలను కొంప’కొల్లేరు’ చేసేలా నిర్ణయాలు చేస్తున్నారన్నారు. మూడో కాంటూరుకు కొల్లేరును కుదించాలని, కాలుష్య నివారణకు ప్రతిపాదిత రెగ్యులేటర్లు నిర్మించాలని, పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే కొల్లేరు ప్రజల ఉపాధిని కాపాడాలని, 22 వేల ఎకరాల ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని, కొల్లేరు ప్రాంత ప్రజలకు అదనంగా ఉపాధిహామీ పనులు కల్పించాలని రవి డిమాండ్ చేశారు. జనసేన దెందులూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గంటసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఇప్పటికే కొల్లేరు ప్రాంతంలో పేదలు, దళితులు ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలసలు పోతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కంటే పక్షులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం దుర్మార్గమని, కొల్లేరువాసిగా బాధపడుతున్నానని తెలిపారు. కొల్లేరు కాలుష్యాన్ని నివారణకు గతంలో చేసిన నిర్ణయాలు అమలు కాలేదని, కేటాయించిన నిధులు ఏమయ్యాయో తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజానాల రామ్మోహన్రావు మాట్లాడుతూ కొల్లేరు ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో తుతూమంత్రంగా అక్కడక్కడ కొద్దిమందితో సభలు జరిపి ఇదే ప్రజాభిప్రాయం అంటూ తప్పుడు రిపోర్టులు కేంద్రానికి పంపడం తగదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజా నిర్ణయాలకు తలొగ్గాలని కోరారు. సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు బి.వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వాలకు ఎన్నికల ముందు గెలవడం కోసం వాగ్దానాలు చేసి గెలిచాక వాటిని గాలికొదిలేయడం పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. పర్యవారణానికి తాము వ్యతిరేకం కాదని, అదే క్రమంలో కొల్లేరు ప్రజల ఉపాధి, రక్షణ కూడా ముఖ్యమేనన్నారు. ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి ఎస్.నాగరాజు మాట్లాడుతూ సిపిఎం ఆధ్వర్యంలో కొల్లేరు ప్రజల సమస్యలపై జరిగే పోరాటాలకు తమ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. బిఎస్పి జిల్లా అధ్యక్షులు నేతల రమేష్, నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర నాయకులు టి.చందు మాట్లాడుతూ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వెళ్లే రాజకీయ పార్టీలకు, నాయకులకు కొల్లేరు ప్రజల సమస్యలపై ముందుకు రావడానికి సమయం దొరకదా అని ప్రశ్నించారు. కొల్లేరు ప్రజల సమస్యలపై మాట్లాడే సిపిఎం వంటి కమ్యూనిస్టు పార్టీలుండటం మంచిదని, వారి పోరాటాలకు మద్దతుగా ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి.కిషోర్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్, గిరిజన సంఘం జిల్లా నాయకులు టి.రామకృష్ణ, రైతు సంఘం జిల్లా నాయకులు కె.శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పి.రామకృష్ణ, చేతివృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు పి.ఆదిశేషు, ఎం.నాగమణి, వి.సాయిబాబు, బి.జగన్నాధరావు మాట్లాడారు.