– రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం
ప్రజాశక్తి-వి.కోట (చిత్తూరు జిల్లా) చిత్తూరు జిల్లా వి.కోట మండల కేంద్రంలో ఓ ఫర్నీచర్ తయారీ కర్మాగారంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. కె.కొత్తూరుకు చెందిన సయ్యద్.. పట్రపల్లి సమీపంలోని కెజిఎఫ్ రోడ్డులో ఉన్న కోళ్ల ఫారంలో ఫర్నీచర్ తయారీ యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో షెడ్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గాలి బలంగా వీయడంతో మంటలు షెడ్డు మొత్తం వ్యాపించాయి. క్షణాల వ్యవధిలో షెడ్డులోని ఫర్నీచర్, తయారీ సామగ్రి కాలిబూడిదైంది. దట్టమైన పొగ పరిసరాల్లో వ్యాపించడంతో స్థానికులు చూసి యజమానికి సమాచారం అందించారు. అప్పటికే మంటలు ఎగసిపడుతూ ఫర్నీచర్ కర్మాగారం మొత్తం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 లక్షలు నష్టం వచ్చిందని యజమాని సయ్యద్ ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, విద్యుత్‌శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. స్థానికంగా ఫైర్‌స్టేషన్ అందుబాటులో లేకపోవడం, కుప్పం నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చే సమయానికి కర్మాగారం పూర్తిగా కాలిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా? మద్యం మత్తులో ఎవరైనా నిప్పు అంటిచారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.