ఎండియు ఆపరేటర్లే సూత్రధారులు?

Nov 30,2023 20:23

ప్రజాశక్తి- బొబ్బిలి : మున్సిపాలిటీలో కందిపప్పు అక్రమాల్లో ఎండియు ఆపరేటర్లే సూత్రదాలు అని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైసు కార్డుదారునికి కిలో కంది పప్పు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుని రేషన్‌ షాపులకు పంపిణీ చేసింది. 35,993 రైసు కార్డులకు 35,993 కిలోల కందిపప్పు సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ 9వేల కిలోల కందిపప్పు మాత్రమే పంపిణీ చేశారు. దీనిలో మున్సిపాలిటీకు ఐదు వేల కిలోలు, రూరల్‌కు 4వేల కిలోల కందిపప్పు సరఫరా చేశారు. ప్రభుత్వం సంపూర్ణంగా కందిపప్పు సరఫరా చేయకపోవడంతో కొంతమంది ఎండియు ఆపరేటర్లు కందిపప్పును బ్లాక్‌ మార్కెట్‌ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అరకొర కందిపప్పు సరఫరాతో అక్రమాలుప్రభుత్వం అరకొర కందిపప్పు సరఫరా చేయడంతో ఎండియు ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. పూర్తి స్థాయిలో కందిపప్పు సరఫరా చేస్తే ఎవరికి ఇవ్వకపోయినా అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. అరకొర సరఫరా చేయడంతో చాలా మంది అపరేటర్లు లబ్ధిదారులకు కంది పప్పు ఇవ్వడం లేదు. కంది పప్పు అందని లబ్ధిదారులు ప్రశ్నిస్తే పూర్తి స్థాయిలో ప్రభుత్వం సరఫరా చేయలేదని షాక్‌గా చూపి 5 నుంచి 10శాతం సరఫరా చేసి మిగిలిన కందిపప్పు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. మల్లమ్మపేట, టిఆర్‌ కాలనీ, గాంధీ బొమ్మ రోడ్డు, గొల్లపల్లి తదితర ప్రాంతాల్లో రైసు కార్డుదారులకు కందిపప్పు సక్రమంగా పంపిణీ చేయకుండా అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కందిపప్పు అక్రమాలపై చర్యలుకందిపప్పు అక్రమాలకు పాల్పడిన ఎండియు అపరేటర్లపై చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల ఉప తహశీల్దార్‌ సాయికృష్ణ చెప్పారు. ఇప్పటికే ఇద్దరిపై చర్యలు తీసుకునేందుకు జేసీకు సిఫార్స్‌ చేశామన్నారు. కందిపప్పు సరఫరాపై సమగ్ర దర్యాప్తు చేసి అక్రమాలకు పాల్పడినట్టు నిర్దారణయితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.కందిపప్పును మింగేస్తున్నారు..పట్టణంలోని చాలా వార్డులు, రూరల్‌ ప్రాంతంలోని అధిక శాతం గ్రామాలలో టన్నుల కొద్దీ కందిపప్పును రేషన్‌ వాహనాల నుంచి దొంగిలించి పెద్ద పెద్ద కిరాణా దుకాణాల వద్దకు తీసుకెళ్లి కొంత మంది మింగేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాల శాఖ ఈ పంది కొక్కులను ఎందుకు కట్టడి చెయ్యడం లేదో సమాధానం చెప్పాలని జనసేన పార్టీ తరపున డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఈ పంది కొక్కుల స్వైరవిహారం కేవలం బొబ్బిలికి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రమంతా ఉన్నప్పటికీ, ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ నిద్రపోతున్నట్లు నటించడం గర్హనీయమన్నారు.కందిపప్పు అక్రమాలపై చర్యలు తీసుకోండికందిపప్పు అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పిసిసి సభ్యులు మువ్వల శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. పట్టణంలో కందిపప్పు పంపిణీపై పరిశీలించి లబ్దిదారులతో మాట్లాడి పంపిణీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు కందిపప్పు పంపిణీ చేయకుండా వ్యాపారులకు అమ్ముకోవడం అన్యాయమన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, లబ్దిదారులందరికి అన్ని రకాల నిత్యావసర సరుకులను రేషన్‌ షాపులు ద్వారా పంపిణీ చేయాలని కోరారు.

 

➡️