ప్రజాశక్తి – తాళ్లరేవు(కాకినాడ) : మండలంలో రెండో రోజు పాదయాత్రలో భాగంగా సుంకరపాలెం ఒక ప్రైవేట్ లేఔట్ నుంచి గురువారం నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రవి జూనియర్ కళాశాల వద్ద నారా లోకేష్‌ను చూడడానికి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి లోకేష్‌తో పాటు కొంత దూరం పాదయాత్ర చేశారు. జార్జి పేట వై జంక్షన్ వద్ద జార్జ్ పేట, నీలపల్లి నాయకులు పిళ్లి సత్తిబాబు, కడలి శ్రీనివాస్, గుత్తుల సూరిబాబు స్వాగతం పలికారు. పి.మల్లవరం జంక్షన్ లో స్థానిక నాయకులు దూళిపూడి వెంకటరమణ, మాజీ సర్పంచ్ దూళిపూడి ఈశ్వరి లోకేష్ కు హారతులు పట్టారు. సుంకటరేవు కాలనీ వద్ద జెండా ఆవిష్కరణ చేస్తారని స్థానిక గ్రామస్తులు ఎదురుచూసినప్పటికీ వారికి నిరాశ మిగిలింది. జై భీమ్ పేట జంక్షన్ వద్ద యువకులు స్వాగతం పలికారు. గాంధీనగర్, చెరువుగట్టు సెంటర్‌లోనూ స్థానికులు లోకేష్‌ను చూడడానికి అధికంగా తరలివచ్చారు. తాళ్ళరేవు సంతపేట సెంటర్లో కంచర్ల లక్ష్మోజి, మాజీ సర్పంచ్ వాసనశెట్టి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ గంజా సూరిబాబు ఆధ్వర్యంలో గజమాలతో స్వాగతం పలికారు. ఈ జంక్షన్లో మహిళలతో లోకేష్ మాట్లాడారు. సీతారాంపురం వద్ద టేకు మూడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో మహిళలు స్వాగతం తెలిపి హారతులు పట్టారు. గుడ్డివాని తూము సెంటర్ వద్ద గాడి మొగ గ్రామ కమిటీ కన్వీనర్ సంగాడి కామేశ్వరరావు, మల్లాడి వరదరాజు, మాజీ జడ్పిటిసి ఈశ్వరరావు, ధర్మారావు ,మాతరాజు, సీతారామరాజు పలువురు మహిళలు లోకేష్ కు హారతులు పట్టారు. పలు చోట్ల లోకేష్ విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. ఈ పాదయాత్రలో లోకేష్ వెంట అమలాపురం టిడిపి పార్లమెంట్ ఇన్చార్జి గంటి హరీష్ మాధుర్, దాట్ల సుబ్బరాజు, పితాని బాలకష్ణ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, కందుల దుర్గేష్, బుచ్చయ్య చౌదరి, బ మందాల గంగ సూర్యనారాయణ, అత్తిలి బాబురావు, ముత్యాల ముత్యాల జయలక్ష్మి, పొన్నమండ రామలక్ష్మి, నడింపల్లి వినోద్, వర్మ రాజు, జక్కల ప్రసాద్ బాబు, మోర్త భైరవమూర్తి, బోయిడ్ వేణుగోపాల్, రోళ్ల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
వినతులు వెల్లువ
రెండో రోజు పాదయాత్రలో లోకేష్‌కు పలువురు వినతులు సమర్పించారు. మా గ్రామానికి సమీపంలోని ఇంజరం ప్రధాన రహదారిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరిందనీ అన్నారు. ఈరోడ్డుకు స్థానిక ఎమ్మెల్యే నాలుగున్నరేళ్ల క్రితం శంకుస్థాపన చేసి నేటికీ పనులు ప్రారంభించలేదన్నారు. అధికారులతో చెబితే వంతెనకు దిగువన నీరు వెళ్లేందుకు తూరలు ఏర్పాటు వేశారు,తూరల్లో చెత్త పేరుకుపోవడం వల్ల నీరు సరిగా రాక నీటి ఎద్దడి ఏర్పడుతోందనీ,దీనివల్ల పంటలకు సకాలంలో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయనీ, 13గ్రామాలు సాగు నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని రైతులు వివరించారు. పి.మల్లవరం గ్రామస్తులు యువనేత లోకేష్‌కు కలిసి వినతిపత్రం సమర్పించారు. 2011లో జీఎస్పీసి కంపెనీ గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ సమయంలో మా గ్రామానికి హామీలు నేటికీ నెరవేర్చలేదన్నారు.సీఎస్‌ఆర్ నిధులను పంచాయతీ పరిధిలో ఖర్చు చేయాలన్నారు. పదో తరగతి పాసైన విద్యార్థులను ఓఎన్జీసీ ఆధ్వర్యంలో చదివించేలా చర్యలు తీసుకోవాలనీ కోరారు. తాళ్లరేవు సెంటర్‌లో ఇసుక నావ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వృద్ధ గౌతమి పాయను ఆనుకుని పిల్లంక, అరటికాయ లంక, నీలపల్లి, తాళ్లరేవు, సీతారాం పురం గ్రామాల్లో ఇసుక ర్యాంపు పై ఆధారపడి జీవిస్తున్న వందలాది కుటుంబాల జీవనాధారం కోల్పోయామని తెలిపారు. ఇసుక నావ కార్మికులకు 50ఏళ్లకు పెన్షన్ సదుపాయం కల్పించాలనీ, భవన నిర్మాణ కార్మికులకు బీమా సదుపాయం కల్పించాలని కోరారు. తాళ్లరేవు మండలం చినబాపనపల్లి, పెదబాపనపల్లి మీదుగా పల్లిపాలెం టు కాజులూరు వెళ్లే రోడ్డు 3 కిలోమీటర్ల మేర పాడైపోయి గుంతలమయమైందనీ పోలేకురు , లచ్చి పాలెం పంచాయతీ ప్రజలు లోకేష్ కు వినతులు అందించారు.