ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య జిల్లా) : బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం పీలేరు మండలం, తలుపుల పంచాయతీ, అబ్బవరంవారిపల్లె, చెరుకువారిపల్లె, హరిజనవాడ, చల్లావాండ్లపల్లె, రాజువారిపల్లె, రెడ్డివారిపల్లెలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జగనన్న పథకాలు కొనసాగాలంటే మరో సారి వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు వంద శాతం అమలు చేశారని చెప్పారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు, విమర్శలకు దిగారని అన్నారు. వారి విమర్శలను తిప్పికొట్టాలని ప్రజలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రొంపిచెర్ల మండలం, గానుగచింత ప్రాజెక్ట్ నుంచి తలపుల వరకు సప్లై చానల్ పనులు చేపట్టాలని కోరారు. ఈ పనులు పూర్తైతే తలుపుల పంచాయితీ పరిధిలోని ఏడు చెరువులకు నీరు అందుతుందని తెలిపారు. వీటి ద్వారా 700 ఎకరాలకు సాగు నీరు అందుతాయన్న ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ప్రతిపాదనలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇరిగేషన్, ఉపాధి అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శిరీషాసందీప్ రెడ్డి, నాయకులు మల్లికార్జునరెడ్డి, చక్రపాణిరెడ్డి, మస్తాన్, కేశవరెడ్డి, అమరనాథరెడ్డి, చంద్రకుమార్‌రెడ్డి, గోపి, సుధీర్‌రెడ్డి, వెంకటరమణనాయుడు, అమరనాథనాయుడు ఆంజినేయులునాయుడు, శేఖర్, తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.