మహిళా స్వశక్తి భవనాన్ని ప్రారంభించాలి

సాధారణకౌన్సిల్‌ సమావేశంలోమాట్లాడుతున్న ఎంఎల్‌ఎ వేగుళ్ల

ప్రజాశక్తి-మండపేట

స్థానిక 20వ వార్డు గొల్లపుంత కాలనీలో నిర్మించిన మహిళా స్వశక్తి భవనాన్ని వెంటనే ప్రారంభించాలని ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఛైర్‌పర్సన్‌ పతివాడ నూక దుర్గారాణి అధ్యక్షతన జరిగిన సాధారణ కౌన్సిల్‌ సమావేశానికి ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు, ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అజెండాలోని 17వ అంశం మహిళా స్వశక్తి భవనం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం ఆమోదం కౌన్సిల్‌ లో చర్చకు వచ్చినపుడు ఎంఎల్‌ఎ వేగుళ్ళ మాట్లాడుతూ సౌకర్యాలతో డ్వాక్రా సంఘ సభ్యుల నగదు మహిళా స్వశక్తి భవనాన్ని పూర్తిచేస్తామని అయితే నాలుగు సంవత్సరాలు పూర్తయిన నేటికీ భవనాన్ని ప్రారంభించలేదన్నారు. డిసెంబర్‌ నెలలో భవనాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. పనులు పూర్తిచేశాకే భవనం ప్రారంభంఅనంతరం ఎంఎల్‌సి తోట మాట్లాడుతూ భవన ప్రారంభానికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని అన్ని పనులు పూర్తిచేసేకే భవనాన్ని ప్రారంభిస్తామన్నారు. స్థానిక 13వ వార్డులో నిర్మాణ పూర్తికాకుండానే భవనాలు ప్రారంభించారన్నారు. అంబేద్కర్‌, జ్యోతిరావుఫూలే, బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహాలను పట్టణంలోని ముఖ్య జంక్షన్లో ఏర్పాటు చేయడం ద్వారా భావితరాలకు ఆదర్శంగా నిలుస్తామన్నారు. ఏర్పాటుకు కౌన్సిల్‌ ఆమోదం తెలపడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తొలుత మాజీ కౌన్సిలర్‌ డాక్టర్‌ పాలడుగు సత్యవతి మతికి కౌన్సిల్‌ సభ్యులు సంతాపం తెలిపారు. సమావేశంలో కౌన్సిల్‌ కో ఆప్షన్‌ సభ్యులు రెడ్డి రాజబాబు, కౌన్సిల్‌ విప్‌ పోతంశెట్టి వరప్రసాద్‌, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

 

 

➡️