ఆయుష్మాన్‌ నమోదు వేగవంతం చేయండి : మున్సిపల్‌ కమిషనర్‌

Nov 30,2023 16:01 #Kakinada

ప్రజాశక్తి-కాకినాడ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన ( పిఎమ్‌ జెఏవై)లో భాగంగా అర్హులైన వారందరినీ ఆయుష్మాన్‌ హెల్త్‌ కార్డులో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ సిహెచ్‌.నాగనరసింహారావు ఆదేశించారు. స్థానిక స్మార్ట్‌ సిటీ కార్యాలయంలో గురువారం ఈ అంశంపై ఏఎన్‌ఎంలకు శిక్షణా కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ వాలంటీర్ల సహకారంతో ప్రతి ఇంటికి వెళ్లి అర్హులను గుర్తించి యాప్‌ లో నమోదు చేయాలని సూచించారు. ఎంతో ప్రయోజనకరంగా ఉండే ఆయుష్మాన్‌ హెల్త్‌ కార్డులను అర్హులందరికీ అందేలా బాధ్యత తీసుకోవాలని కోరారు. కార్డులు జారీ అయిన లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు ఈకేవైసీ కూడా పూర్తి చేయాలని సూచించారు. అలాగే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంపై కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలని, అర్హులందరితో ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్లోడ్‌ చేయించాలని సూచించారు. జిల్లా ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఆయుష్మాన్‌ హెల్త్‌ కార్డు వల్ల ఇతర రాష్ట్రాలలోకూడా వైద్య సేవలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. రూ.5 లక్షల పరిధి కలిగిన వైద్య సేవలతో పాటు ఇతర ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. ఎంహెచ్‌ఓ డాక్టర్‌ పృథ్వి చరణ్‌ మాట్లాడుతూ.. డాక్టర్‌ వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్య సేవలు పొందే విధానాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం సమకూర్చిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేయాలని సూచించారు. సమావేశంలో ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్‌ నవీన్‌, టీం లీడర్‌ హనుమకుమార్‌, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

➡️