నిరశన తెలియజేసే హక్కుని కాపాడాలి : అఖిలపక్ష నాయకులు

Nov 30,2023 15:56 #Kakinada
  • పోలీసు నిర్బంధాన్ని ఎత్తివేయాలి

ప్రజాశక్తి-కాకినాడ : రాజ్యాంగం కల్పించిన నిరసన తెలియజేసే హక్కుని కాకినాడ కలక్టరేట్‌ వద్ద కొనసాగించాలని కోరుతూ కాకినాడ అఖిలపక్ష నాయకులు జాయింట్‌ కలెక్టర్‌ ఇళక్కియాకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. 2021 డిసెంబర్‌ నెలలో ఏ రాజకీయ పార్టీకి, ఏ ప్రజా సంఘానికి సమాచారం ఇవ్వకుండా కాకినాడ ఆర్డిఓ తూతూ మంత్రంగా సమావేశం నిర్వహించి ధర్నాచౌక్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ర్యాలీలు, ధర్నాలను నిషేధిస్తూ తీసుకువచ్చిన జీవో నెంబర్‌ ఒకటిని రాష్ట్ర హైకోర్టు కొట్టి వేసిన తర్వాత కూడా కాకినాడ కలెక్టరేట్‌ వద్ద నిషేధ ఉత్తర్వులను అనధికారికంగా అమలు చేస్తూ ప్రజాసంఘాల నాయకులను, రాజకీయ పార్టీల నాయకులను నిర్బంధిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీ ని కలవగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. అయితే కింది స్థాయి పోలీసు అధికారులు మాత్రం చట్ట ధిక్కరణకు పాల్పడడం, హైకోర్టు ఆదేశాలను, రాజ్యాంగం కల్పించిన నిరసన తెలియజేసే హక్కును కాలరాస్తు వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. అధికార పార్టీకి మాత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు పోలీసులు సహకరిస్తూ, ప్రతిపక్ష పార్టీలకు, ప్రజా సంఘాల కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తూ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తక్షణం కలెక్టరేట్‌ వద్ద నిరసనలను నిషేధిస్తూ ఇచ్చిన ఉత్తరేలను రద్దుచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జాయింట్‌ కలెక్టర్‌ కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దువ్వ శేషబాబ్జి, సిపిఐ జిల్లా నాయకులు పప్పు ఆదినారాయణ, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్‌ నరాల శివ, ఆర్‌.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి పిట్టా వరప్రసాద్‌, రాజ్యాధికారి పార్టీ జిల్లా నాయకులు రాయుడు మోజెస్‌, టిఎన్టియుసి జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, జిల్లా కోశాధికారి మలకా రమణ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, ఐఎన్టియుసి ఏపీ అండ్‌ తెలంగాణ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తాళ్లూరి రాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల ఈశ్వరి, ఏపీ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

➡️