కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే ఆదిమూలం
ప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి జిల్లా): సత్యవేడు నియోజకవర్గ సమస్యలను జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి దృష్టికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. గురువారం ఉదయం 10 గంటలకు తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే ఈ మేరకు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఇందులో ప్రధానంగా వర్షానికి దెబ్బతిన్న రోడ్లను బాగు చేయడానికి నిధులు కేటాయించాలన్నారు. పిచ్చాటూరు మండలంలోని ఎస్ ఎస్ బి పేట గ్రామం వద్ద ఉన్న భూములలో అదే గ్రామంలోని అర్హులైన పేద ప్రజలకు పంపిణీ చేయాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. పిచ్చాటూరు మండలం వేలూరు హరిజనవాడలోని మేత బీడు, గ్రామ కంఠం గా ఉన్న భూమిని అర్హులైన దళితులకు పంచి పెట్టాలని ఆయన కోరారు. వరదయ్యపాలెంలో పెండింగ్ లో ఉన్న ఇంటి పట్టాల భూ సమస్యను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేయాలన్నారు. అలాగే సత్యవేడు నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న అంగన్వాడి పోస్టులను తక్షణం భర్తీ చేయాలని కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.