యుజిసి అత్యుత్సాహం

Nov 30,2023 08:19 #RSS, #UGC
in-maharashtra-ugc-asks-universities-to-celebrate-abvp-leaders-birth-centenary

ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడి జయంతి శతాబ్ది ఉత్సవాలను జరపాలంటూ మహారాష్ట్ర యూనివర్శిటీలకు ఆదేశాలు

న్యూఢిల్లీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండే బిజెపి ‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కార్‌.. విద్యా వ్యవస్థను కాషాయీకరించే ప్రయత్నాలను కొనసాగిస్తున్నది. పాఠ్యాంశాలలో మార్పులు, చేర్పులు వంటి పనులతో ఇప్పటికే తన చర్యలను కొనసాగిస్తున్నది. రాజ్యాంగబద్ధ సంస్థలను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నది. ఇలాంటి వివాదాస్పద చర్యలపై విద్యావేత్తలు, నిపుణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. బిజెపి తీరులో మాత్రం మార్పు కనిపించటం లేదు. తాజాగా, మహారాష్ట్రలోని యూనివర్సిటీలు, కాలేజీలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసింది. ఆరెస్సెస్‌ నాయకుడు దత్తాజీ దిదోల్కర్‌ జయంతి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించాలని ఆదేశించింది. ఈ మేరకు ఈనెల 21న లేఖ రాసింది. అయితే, యూజీసీ అత్యుత్సాహంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఆరెస్సెస్‌ విద్యార్థి విభాగం ఏబీవీపీ వ్యవస్థాపక సభ్యుడు కూడా అయిన దిదోల్కర్‌ను స్మరించుకోవడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాసిన తర్వాత విద్యా సంస్థలకు యూజీసీ నుంచి ఆదేశాలు రావటం గమనార్హం. శివసేన(యూబిటి) అభ్యంతరం యూజిసి లేఖపై శివసేన (యూబీటీ) యువజన విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. యువసేన ముంబై యూనివర్శిటీ మాజీ సెనేట్‌ సభ్యుడు ప్రదీప్‌ సావంత్‌ మాట్లాడుతూ ” జయంతి ఉత్సవాలను రాజకీయ పార్టీలు, ఆరెస్సెస్‌ వారి స్వంత నిధులతో చేయాలి. కాలేజీలు, యూనివర్సిటీలపై దీన్ని విధించకూడదు. ఈ కార్యక్రమం నాగ్‌పూర్‌లో జరగనుంది. అలాంటప్పుడు మహారాష్ట్రలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలకు లేఖలు ఎందుకు జారీ చేస్తారు?” అని ప్రశ్నించారు.

➡️